సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): మీరు మనీలాండరింగ్ కేసులో ఉన్నారు.. మిమ్మల్ని అరెస్ట్ చేయాలి.. లేదంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెక్యూరిటీ డిపాజిట్ చేయండి.. లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుందంటూ ఓ రిటైర్డు ఎస్ఈను డిజిటల్ అరెస్ట్ చేసిన సైబర్‌నేరగాళ్లు.. అతని నుంచి రూ. 58 లక్షలు కాజేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సరూర్‌నగర్‌కు చెందిన రిటైర్డు ఎస్ఈకి గత నెల 1న టెలికమ్యూనికేషన్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నామని, మీ పేరుతో మరో మొబైల్ నంబర్ ఉందం టూ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు.
ఆ ఫోన్ నంబర్ నుంచి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపి వేధిస్తున్నారని, మీరు వెంటనే బెంగుళూర్లోని అశోక్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేయాలని చెప్పారు. దానితో నాకు ఏ సంబంధం లేదని, నేనుందుకు ఫిర్యాదు చేయాలంటూ బాధితుడు ఆ కాల్‌ను పక్కనపెట్టాడు. కొద్దిసేపటి తరువాత వాట్సాప్ వీడియో కాల్లో నా పేరు సందీప్‌రావు అశోక్‌నగర్ పీఎస్ సబ్ఇన్స్పెక్టర్ను మాట్లాడుతున్నానంటూ.. మరో నంబర్‌కు కనెక్ట్ చేశాడు. అవతలి వ్యక్తి తాను పోలీస్‌నని.. మీ పేరుపై ఉన్న ఫోన్ నంబర్ ఆధారంగా బ్యాంకు ఖాతాను తెరిచారని, అందులో మీ ఆధార్ నంబర్‌కు కూడా వాడారని, ఆ బ్యాంకు ఖాతా సదాఖత్ ఖాన్ అనే వ్యక్తికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసుతో లింక్ ఉందంటూ భయపెట్టారు.
ఈ విషయం ఎవరితోను చర్చించవద్దు , మీపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యిందని, మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉందంటూ బెదిరించారు. మీరు దర్యాప్తు అధికారితో మాట్లాడుతానంటే ఒక ఫోన్ నంబర్ ఇచ్చారు. మరుసటి రోజు నవజ్యోత్ సిమి పేరుతో దర్యాప్తు అధికారినంటూ ఒక మహిళ వీడియో కాల్లో మాట్లాడింది. మీపై ఇప్పటికే వారెంట్ ఉంది, అయితే అరెస్ట్ కాకుండా ఉండాలంటే మీ ఖాతాలు అడిట్ చేసేంత వరకు కొంత నగదు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని, ఆర్బీఐ మీ ఖాతాలు తనిఖీ చేసి రెండు మూడు రోజుల్లో క్లియరెన్స్ ఇస్తుందని, ఆ డబ్బంతా మీకు వాపస్ వస్తుందంటూ నమ్మబలికారు.
బాధితుడు అది నిజమని నమ్మి తన వద్ద ఉన్న రూ.21.5 లక్షలు సైబర్‌నేరగాళ్ల ఖాతాలోకి బదిలీ చేశాడు. మరుసటి తిరిగి ఫోన్ చేసిన సైబర్‌నేరగాళ్లు మీరు రూ. 57.32 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉందని, ఆ సెక్యూరిటీ డిపాజిట్ సుప్రీంకోర్టు నిర్ణయించిన మేరకు ఉంటుందని, ఒక నోటీసును పంపించారు. బాధితుడు తన వద్ద ఉన్న గోల్డ్, ఇతర స్కీమ్‌ల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు రద్దు చేసుకొని రూ. 26.80 లక్షలు పంపించాడు. ఆ తరువాత ఇంటి డాక్యుమెంట్లు కుదవపెట్టి రూ. 10 లక్షలు పంపించాడు. అయినా కూడా ఇంకా డబ్బు అడుగుతుండడంతో ఇదంతా మోసమని గుర్తించి రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.