సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): వాట్సాప్ మేసేజ్‌లతో పాటు తెలియని గ్రూపుల్లో యాడ్ అవుతున్న కొందరు అక్కడ నడుస్తున్న చర్చలు నిజమని నమ్మి నిండా మునుగుతున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్‌లలో గుర్తుతెలియని వ్యక్తులు ఇన్వెస్ట్మెంట్, పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో వివిధ గ్రూప్‌లు తయారు చేసి అందులో కొత్తవారిని చేరుస్తున్నారు. అయితే ఆయా గ్రూపుల్లో సగానికి పైగా సైబర్ఛీటర్లే ఉంటారు. వీరంతా పెట్టుబడులు, వాటిపై వచ్చే లాభాల గూర్చి చర్చిస్తుంటారు. ఈ గ్రూపుల్లో జరుగుతున్న చర్చలు నిజమని నమ్మి పెట్టుబడులు పెడుతున్న ప్రైవేట్, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇల్లు గుల్ల చేసుకుంటున్నారు. మే 21, 22 తేదీల్లో ఇలాంటి కేసులు అనేకం రాచకొండ సైబర్ క్రైం ఠాణాలో నమోదయ్యాయి. మచ్చుకు కొన్నింటిని పరిశీలిస్తే..
దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి న్యూ క్యాస్టిల్లో అడ్వర్టైజింగ్ ఆన్లైన్ అసైన్మెంట్ గ్రూప్ 020లో చేరాడు. గూగుల్ మ్యాప్స్‌లో రేటింగ్ అంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగం కోసం అందులో చేరిన బాధితుడు మొదట రూ.2 వేల పెట్టుబడి పెట్టాడు. అతడు పెట్టిన పెట్టుబడికి 20 శాతం లాభాలంటూ రిటర్న్ ఇచ్చాడు. ఆ తరువాత వీఐపీ గ్రూప్ అంటూ గూగుల్ డిజిటల్ వర్కింగ్ క్రిప్టో కరెన్సీ – బీటీసీలో ఇన్వెస్ట్ చేయాలంటూ నమ్మిస్తూ బాధితుడి వద్ద నుంచి దఫదఫాలుగా రూ. 34.12 లక్షలు కాజేశారు. మోసమని గ్రహించిన బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇంజాపూర్కు చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్‌లో బినోమో పివోట్ ఇన్వెస్టింగ్ యాప్ ప్రకటన చూసి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ట్రేడింగ్ చేశాడు. కొన్ని రోజుల వరకు తక్కువ పెట్టుబడులు పెట్టడంతో లాభాలు పంపిస్తున్నట్లు సైబర్ఛీటర్స్ నమ్మించారు. కొన్నాళ్ల తరువాత ఇలా తక్కువ పెట్టుబడితే సంపాదన ఎక్కువ ఉండదని, వీఐపీ, ప్రెస్టేజ్ సభ్యత్వం తీసుకుంటే అందులో డిపాజిట్లపై ఇన్సూరెన్స్ కూడా ఉంటుందంటూ నమ్మించాడు. ఇలా సుమారు నాలుగు సంవత్సరాలలో 434 ట్రాన్సాక్షన్స్‌లతో రూ.2,40,85,778 పెట్టుబడిగా పెట్టగా ఆరుసార్లు రూ.8,24,997 లాభం పొందాడు. రూ. 2,32,60,781 మోసపోవడంతో బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు.
ఆదిబట్లకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఫోన్ నంబర్‌ను ఎస్ఎంఎస్-716 ఇన్వెస్ట్మెంట్ అనే పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌నకు కలిపారు. అందులో 100 మంది సభ్యులుండగా అడ్మిన్ ఫోన్ చేసి అరోరా మ్యాక్స్ యాప్‌ను డౌన్లో చేసుకోవాలని సూచించింది. మొదట కొన్ని పెట్టుబడులకు మంచి లాభాలిచ్చారు. నమ్మకం కుదరడంతో తన పెట్టుబడిని బాధితుడు పెంచుతూ వెళ్లాడు. ఇలా రూ. 37.75 లక్షలు పెట్టుబడి పెట్టగా రూ.4.5 లక్షలు బాధితుడికి తిరిగి వచ్చాయి. మిగతా రూ. 33.25 లక్షలు విత్ డ్రా చేసుకోవడానికి ప్రయత్నిస్తే 20 శాతం బ్రోకరేజి ప్రత్యేకంగా చెల్లించాలని, ఆ మొత్తం చెల్లిస్తేనే మిగతావి విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుందంటూ షరత్ విధించారు. బాధితుడు ఆరోరా మ్యాక్స్ యాప్‌పై ఆరా తీయడంతో అదంతా ఫ్రాడ్ అని తేలడంతో రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
రామాంతాపూర్‌కు చెందిన ఒక ఇంజినీర్ ఫోన్ నంబర్‌ను హెచ్ఎస్బీసీ ఐ-068 గ్లోబల్ ఫైనాన్స్ వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు. అందులో 90 మంది సభ్యుల వరకు ఉన్నారు. ఆ గ్రూప్‌నకు అడ్మిన్‌గా ఉన్న రియా బన్సాల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ఫోన్ చేసి హెచ్ఎస్ఎస్ఎస్పీఎంఏ యాప్ డౌన్లోడ్ చేసుకొని ట్రేడింగ్ చేస్తే మంచి లాభాలొస్తాయని.. ఐపీఓలు కూడా తక్కువ ధరకు వచ్చేస్తాయంటూ నమ్మించింది. ఒకటి రెండు సార్లు తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడంతో లాభాలు చూపించిన సైబర్‌నేరగాళ్లు ఇన్ఫోనేటివ్ సొల్యూషన్ లిమిటెడ్‌కు చెందిన 50200 షేర్స్ అలాట్ చేశారని వాటి ధర రూ. 51.27 లక్షలు కాగా డిస్కౌంట్లో రూ.26 లక్షలకే వస్తాయంటూ నమ్మించారు.
దీంతో బాధితుడు ఆ డబ్బును చెల్లించాడు. తరువాత స్క్రీన్‌పై కన్పిస్తున్న డబ్బులను విత్‌డ్రా చేసుకునేందుకు వీలు కాకపోతే నిర్వాహకులకు ఫోన్ చేశారు. రూ.3లక్షలు చెల్లిస్తే విత్‌డ్రాకు అప్షన్ ఇస్తామని నమ్మించారు. దీనిపై అనుమానం వచ్చిన బాధితుడు తెలిసిన వారితో ఈ విషయం చర్చించడంతో అదంతా మోసమని తెలిపారు. దీంతో రాచకొండ సైబర్‌క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇందులో రూ. 21,500 లాభం చూపించి రూ. 25.80 లక్షలు సైబర్‌నేరగాళ్లు కాజేశారు.