సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ): పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో సైబర్‌నేరగాళ్లు అందినకాడికి దోచేస్తున్నారు. అయితే.. చుదువుకున్నవాళ్లే ఈ మోసాల బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. గూగుల్ రివ్యూలు రా యాలంటూ ముందుగా వలవేసి ఆ తరువాత మీరు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు సంపాదిస్తారంటూ ఆశ పెట్టి నట్టేట ముంచుతున్నారు. రాచకొండ సైబర్‌క్రైమ్‌లో ఒక్కరోజులో సైబర్‌నేరగాళ్లు రూ. 55 లక్షలు కాజేశారు.
ఆయా సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి..
మల్కాజిగిరి, దయానందనగర్‌కు చెందిన ఓ వ్యాపారికి పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో ఒక మెసేజ్ వచ్చింది. ఆ తరువాత ఒక మహిళ తాను హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్నానని, మా వద్ద పార్ట్‌టైమ్ ఉద్యోగాలున్నాయని, గూగుల్‌లో మేం చెప్పిన సంస్థలకు రివ్యూస్రాసి దానిని స్క్రీన్ షాట్ తీసి పంపించాలని, ఒకో టాస్క్ రూ.50 ఇస్తామని.. ఇలా ఖచ్చితంగా 21 టాస్క్‌లు ఇస్తామంటూ నమ్మించారు. మొదట మూడు టాస్క్‌లు చేయించి అందుకు డబ్బులు పంపించిన సైబర్‌నేరగాళ్లు, మీరు పెట్టుబడి పెట్టి టాస్క్‌లు చేస్తే మంచి లాభాలుంటాయని, క్రిప్టో కరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలంటూ నమ్మించారు. ఇలా మొదట రూ.5.7లక్షలు, తరువాత రూ.2.7 లక్షలు దఫ దఫాలుగా రూ.30.28 లక్షలు బాధితుడితో పెట్టుబడిగా పెట్టించి మోసం చేశారు.
ఐటీ ఉద్యోగం చేసే సఫిల్‌గూడకు చెందిన బాధితుడి వాట్సప్‌కు పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో ఒక మెసేజ్ వచ్చింది. అందులో గూగుల్‌లో రెస్టారెంట్స్‌పై రివ్యూ రాయాలని సూచించారు. మొదట రూ. 150 బాధితుడికి పంపించిన సైబర్‌నేరగాళ్లు టెలిగ్రామ్ గ్రూప్‌లో అతని నంబర్ యాడ్ చేసి దానికి టాస్క్గ్రూప్ అని పేరుపెట్టారు. అందులో పార్ట్‌టైమ్‌లో టాస్క్‌లు ఎలా పూర్తి చేయాలని, డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే అదనంగా డబ్బు సంపాదించడం ఎలా అనే అంశాలపై మెలుకులు నేర్పించి, బాధితుడి వద్ద నుంచి నెమ్మదిగా పెట్టుబడులు పెట్టించారు. మొదట తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టించి.. వాటికి లాభాలంటూ తిరిగి పంపించారు. ఆ తరువాత లక్షల్లో పెట్టుబడి పెట్టించి రూ. 9.01 లక్షలు నిండా ముంచేశారు.
ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే లింగోజిగూడకు చెందిన బాధితుడి వాట్సప్‌కు అమెరికాకు చెందిన విలియం సోనమ్ కంపెనీ ఉద్యోగాలు ఆఫర్ చేస్తుందంటూ ఒక మెసేజ్ వచ్చింది. ఉద్యోగం కావాలంటే లింక్ క్లిక్ చేసి వివరాలు పంపించాలని సూచించారు. బాధితుడు వివరాలు రిజిస్టర్ చేసి పంపించిన తరువాత తాము కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని, మొదట మీరు కొంత పెట్టుబడి పెట్టి పరీక్షించుకోండంటూ సూచనలు చేశాడు. వారి మాటలు నమ్మిన బాధితుడు రూ.11వేలు పెట్టుబడి పెట్టడంతో 1200 లాభం వచ్చిందంటూ బాధితుడి ఖాతాకు పంపించారు. ఆ తరువాత వాళ్లపై నమ్మకం పెరగడంతో బాధితుడు దఫ దఫాలుగా రూ.16.60 లక్షలు పెట్టుబడి పెట్టాడు. స్క్రీన్ పై రూ.28 లక్షల లాభం చూపిస్తున్నా వాటి ని విత్‌డ్రా చేసుకోవాలంటే మరింత పెట్టుబడి పెట్టాలంటూ సూచనలు చేయడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేపట్టారు.