సిటీబ్యూరో, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసగిస్తున్న ఆరుగురు సభ్యులు గల ముఠాను సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం డీసీపీ కల్మేశ్వర్, సైబర్‌క్రైం ఏసీపీ శ్యాంబాబుతో కలిసి సైబర్‌క్రైం డీసీపీ రితిరాజ్ కేసు వివరాలను వెల్లడించారు. బిహార్‌కు చెందిన సన్నికుమార్ యూపీకి చెందిన అర్చన సింగ్, రుచి భారతి, శవిపాల్, శాంతి, మీనా రాజ్‌పుత్ ముఠాగా ఏర్పడ్డారు. బిహార్‌లోని నలంద ప్రాంతంలో ఒక ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ రికవరీ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. అదే ముసుగులో జాబ్ పోర్టల్స్ నుంచి నిరుద్యోగుల వివరాలను సేకరించి, ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆన్లైన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ నమ్మిస్తారు.
సర్వీస్ చార్జ్ కింద నిరుద్యోగుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజు, రెజ్యూమ్ అప్డేటింగ్ ఫీజు, ఇంటర్వ్యూ చార్జస్ వంటివి వసూలు చేస్తారు. డబ్బులు వచ్చిన తరువాత వారికి ఎలాంటి ఉద్యోగవకాశాలు ఇవ్వకపోవడంతో పాటు వారి ఫోన్లు, మెయిల్స్‌ను బ్లాక్ చేస్తారు. ఈ క్రమంలోనే నార్సింగి, దుండిగల్, చందానగర్ తదితర పోలీసు స్టేషన్లలో పలువురు నిరుద్యోగులు మోసపోవడంతో కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన సైబర్‌క్రైం ప్రత్యేక బృందాలు యూపీ, బిహార్‌కు వెళ్లి ఏక కాలంలో దాడులు జరిపి ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 15సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్, ప్రింటర్, 3డెబిట్ కార్డులు, ఉద్యోగుల రిజిస్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు.