సిటీబ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ): స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించొచ్చంటూ ఇన్వెస్టర్స్ టీ పార్టీ పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్‌ను తయారు చేసిన సైబర్‌నేరగాళ్లు ఓ న్యాయవాదికి రూ.40 లక్షలు బురిడీ కొట్టించారు. రామంతపూర్‌కు చెందిన బాధితుడు వృత్తిరీత్యా న్యాయవాది. గతేడాది డిసెంబర్ నెలలో తన వాట్సాప్ బ్రౌజ్ చేస్తుండగా తన ఫోన్ నెంబర్ ‘ఈ-2 స్టాక్ ఇన్వెస్టర్ టీ పార్టీ’ గ్రూప్‌కు యాడ్ చేసిన విషయాన్ని గుర్తించాడు. ఆ తరువాత వాట్సాప్‌లో నిషా మిశ్ర పేరుతో మేసేజ్‌లు పంపించి, మా వెబ్సైట్లో స్టాక్ ట్రేడింగ్ చేస్తే మంచి లాభాలొస్తాయని నమ్మించారు. దీంతో బాధితుడు ఎస్ఈఈసీ.
యుఎస్.సీసీ అనే పేరుతో వచ్చిన లింక్‌ను క్లిక్ చేసి అందులో అకౌంట్ క్రియేట్ చేసుకున్నాడు. కొన్ని రోజులు వాళ్లు చెప్పే విషయాలను గ్రూప్‌లో వింటూ, ఫోన్లో మాట్లాడాడు. తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని మొదట రూ. 20 వేలు పెట్టుబడి పెట్టాడు. మీరు ఎక్కువగా పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని, మీరు కొనుగోలు చేసే ఐపీవో షేర్స్‌కు రుణం కూడా వస్తుందని నమ్మించారు. దీంతో బాధితుడు రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు.
స్క్రీన్‌పై లాభాలు కన్పిస్తున్నాయి, అందులో నుంచి రూ.10 వేలు విత్ డ్రా చేశాడు. దీంతో సైబర్‌నేరగాళ్లు చెప్పే మాటలు నిజమనే భావన కలగడంతో దఫదఫాలుగా స్టాక్స్‌పై రూ.40.41 లక్షల వరకు పెట్టుబడి పెడుతూ వెళ్లాడు. స్క్రీన్‌పై అసలు, లాభంతో కలిపి రూ.78 లక్షలు చూపించాయి. అందులో నుంచి విత్ డ్రా చేసుకోవాలని బావిస్తే అందుకు అవకాశం లేదని మేసేజ్ వచ్చింది.
బాధితుడు కస్టమర్ కేర్‌కు ఫోన్ చేయడంతో ఇప్పుడు ఐపీవోలో కొనుగోలు చేసే సమయమని మీరు బారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్ ఐపీవోలు కొనాలని సూచన చేశారు. అందుకు కొంత డబ్బు చెల్లించాలని సూచనలు చేయడంతో తనకు ముందుగా అకౌంట్లో ఉన్న డబ్బులు కావాలని రిక్వెస్ట్ పెట్టాడు. అయితే డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.