సిటీబ్యూరో, నవంబర్ 23(నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు మరో ప్రమాదకరమైన పంజా విసిరారు. వాట్సాప్గ్రూపులపై ఏపీకే ఫైల్స్ పంపి ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఆదివారం ఒక్కరోజు లక్షలాది ఫోన్లకు ఎస్బీఐ ఏపీకే పేరుతో ప్రమాదకరమైన ఫేక్ ఏపీకేలు వచ్చాయి. ఈ క్రమంలో పలువురు తెలంగాణ మంత్రుల వాట్సప్ , మీడియా గ్రూపులు హ్యాక్ కావడం కలకలం రేపుతోంది. ఆధార్‌ను అప్డేట్ చేసుకోవాలంటూ ఎస్బీఐ పేరుతో మంత్రులు, జర్నలిస్టులకు మెసేజ్‌లు చేస్తున్నారు. యువర్ ఎస్బీఐ అకౌంట్ విల్ బి బ్లాక్డ్ .. అప్డేట్ ఆధార్ అని చెప్పి ఎస్బీఐ ఆధార్ అప్డేట్.ఏపీకే అనే మాల్వేర్ను పంపిస్తున్నారు.
ఇది పూర్తిగా నకిలీది.. ప్రమాదకరమైనదని ఎవరూ ఈ ఫైల్స్ ఓపెన్ చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. గత రెండురోజులుగా వాట్సప్ గ్రూపులు హ్యాక్ అవుతున్నాయని రిపోర్టులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. వాట్సప్ గ్రూపులో సడన్‌గా ఒక గ్రూపుకు ఐకాన్ మారిపోయి ఎస్బీఐకి సంబంధించిన ఐకాన్ వ చ్చిందని, దీంతో ఆ గ్రూప్ హ్యాక్ అయినట్లుగా సైబర్ నిపు ణులు చెప్పారు. హ్యాకర్లు డేటాను దొంగిలించడం కోసం లేదా మీ అకౌంట్‌ను కంట్రోల్లోకి తీసుకోవడం కోసం ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారని పేర్కొన్నారు. తెలియక ఏపీకే ఫైల్స్‌ను ఓపెన్ చేయవద్దని, ఫార్వర్డ్ చేసే మెసేజ్‌లతో జాగ్రత్తగా ఉండాలని, ఇందుకోసం వాట్సప్‌లో టూ స్టెప్ వెరిఫికేషన్ చేయాలని సైబర్ పోలీసులు సూచించారు.
ఎస్బీఐ పేరుతో వచ్చిన ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేస్తే ఫోన్లోని ఓటీపీ, ఎస్ఎంఎస్, యూపీఐ పిన్ మొత్తం హ్యాకర్లకు వెళ్లిపోతాయి. పదినిముషాల్లో మీ ఖాతా ఖాళీ అయిపోతుంది. అసలు ఎస్బీఐ ఎప్పుడూ వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపదని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఏపీకే ఫైల్ పంపదని, ఆధార్ అప్డేట్ కోసం లింకులు పంపదని సైబర్ నిపుణులు తెలిపారు. వాట్సాప్‌లో వచ్చిన ఎస్బీఐ, కేవైసీ, ఆధార్ అప్డేట్ మెసేజ్‌లను వెంటనే డిలీట్ చేయ మని వారు సూచించారు. ఇది కొత్తగా వచ్చిన పెద్ద స్కామ్. ఇది అందరికి వస్తుంది.. వాట్సాప్ గ్రూపులపై పనిచేస్తుంది.
వాట్సాప్ ద్వారా భయపెట్టే సందేశం పంపుతారు. అప్డేట్ యువర్ ఆధార్ అని చెప్పి మాల్వేర్ ఏపీకే పంపుతారు. ఇన్స్టాల్ చేస్తే స్క్రీన్ రికార్డింగ్ ఆన్ అయి ఎస్ఎంఎస్, ఓటీపీ యాక్సెస్ వస్తుందని, యూపీఐ యాప్స్ ఆటో లాగిన్ అవుతాయని వారు పేర్కొన్నారు. వాట్సాప్ గ్రూపులో వచ్చిన ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేయకుంటే పంపిన వారి నంబర్ బ్లాక్ చేయాలని, ఆ మెసేజ్‌ను డిలీట్ చేసి , గ్రూపులో ఉన్నవారికి కూడా ఇది స్కామ్ అని చెప్పాలి. ఏపీకే ఫైల్ ఇన్స్టాల్చేసి ఉంటే వెంటనే ఫోన్‌ను ఎరోప్లేన్ మోడ్‌లో పెట్టాలి. బ్యాంక్ కస్టమర్‌కేర్‌కు ఫోన్ చేసి నెట్ బ్యాంకింగ్, డెబిట్‌కార్డ్, యూపీఐ అన్నీ బ్లాక్ చేయాలని సైబర్ పోలీసు లు చెప్పారు.
వాట్సాప్ గ్రూపులు, వ్యక్తిగత ఖాతాలపై సైబర్ నేరగాళ్లు దాడి చేస్తున్న క్రమంలో ఓ చానల్‌కు చెందిన మహిళా రిపోర్టర్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన నంబర్‌ను హ్యాక్‌చేసి క్షణాల్లోనే ఆమె బంధువులు, స్నేహితులకు డబ్బు లు కావాలంటూ మెసేజ్‌లు పెట్టడంతో నిజమే అని నమ్మి కొందరు డబ్బులు పంపినట్లు బాధితురాలు చెప్పారు. ఈ వ్యవహారంలో సుమారు ఐదులక్షల వరకు బాధితురాలి నంబర్ ద్వారా కొల్లగొట్టినట్లు గ్రహించిన మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదు చేయడానికి ఆదివారం సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు వచ్చారు. సైబర్ క్రైమ్స్ సిబ్బంది తామేం చేయలేమంటూ చేతులెత్తేసి ఆదివారం కావడంతో సిబ్బంది తక్కువగా ఉన్నారంటూ చెప్పారని, ఈ విషయం తాను బయటకు ఫోన్లో చెబుతుంటే తనపై దౌర్జన్యం చేస్తూ నిర్బం ధించారని ఆమె వాపోయారు.