సిటీబ్యూరో, జూలై 6(నమస్తే తెలంగాణ): డిజిటల్ అరెస్ట్ ఘటనలలో సైబర్‌నేరగాళ్లు నయా పంథాలో సుప్రీంకోర్టు పేరును వాడుతూ వృద్ధులు, రిటైర్డు ఉద్యోగులను బెంబేలెత్తిస్తూ అందినకాడికి దోచేస్తున్నారు. గత కొంత కాలంగా ఢిల్లీ, ముంబై పోలీసులు, సైబర్ పోలీసులు, సీబీఐ పేర్లతో బెదిరిస్తూ దోచేస్తూ వస్తున్న సైబర్‌నేరగాళ్లు ఇటీవల సుప్రీంకోర్టు పేరును విరివిగా వాడేస్తున్నారు. ఓ పక్క సుప్రీంకోర్టు, మరో పక్క ఆర్బీఐ పేర్లను వాడడంతో ఆ రెండు అత్యున్నత సంస్థలు కావడంతో సీనియర్ సిటిజన్లు సైతం కొందరు సైబర్‌నేరగాళ్లు వేస్తున్న వలలో చిక్కుతున్నారు.
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో తమపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరుపుతారంటే తప్పకుండా తమకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయంలోకి బాధితులు ఉంటున్నారు. సుప్రీంకోర్టు పేరు వాడటం, నకిలీ చీఫ్ జస్టిస్లను సృష్టించడంతోపాటు సుప్రీంకోర్టు నుంచి నోటీసులు జారీ అయ్యాయంటూ నకిలీ స్టాంప్‌లను వాడుతూ బాధితులను ఆ నకిలీ నోటీసులను పంపిస్తున్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసు విచారణ సాగడంతోపాటు అరెస్ట్ చేయడానికి వారెంట్ జారీ అవుతుందని, అరెస్ట్ కాకుండా ఉండాలంటే భారీ మొత్తంలో సెక్యూరిటీ డిపాజిట్ చేయాలంటూ అందులో ఆయా మొత్తాలను సైతం సైబర్‌నేరగాళ్లు పేర్కొంటున్నారు. తయారు చేసిన నకిలీ నోటీసులను వాట్సాప్‌లలో పంపిస్తూ ఇతరులెవరికైనా చూపిస్తే మీకే సమస్య వస్తుందంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
ఒక మనీలాండరింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్ కేసులతో సంబంధాలున్నాయంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఈ కేసుల్లో నేరుగా సంబంధం లేకున్నా, మీ ఆధార్‌ను ఇతరులు వాడి ఫోన్ నంబర్ తీసుకున్నారని, ఆ నంబర్‌తోనే ఇదంతా జరిగిందంటూ సైబర్‌నేరగాళ్లు చెప్పుకుంటూ మీపై అనుమానం మాత్రమే ఉందని, మీరు మా విచారణకు సహకరించకపోతే వెంటనే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని, మీకు ఈ కేసుతో ఏం సంబంధం లేదంటూ తేలితే మీరు ఈ కేసు నుంచి ఫ్రీ అవుతారంటూ మాయమాటలు చెబుతుంటారు. అప్పటి వరకు మీరు కొంత డబ్బును సుప్రీంకోర్టు, ఆర్బీఐ పర్యవేక్షణలోని బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయాలని, విచారణ తరువాత ఆ డబ్బు మీకు తిరిగి వస్తుందంటూ నమ్మిస్తూ అందిన కాడికి వృద్ధులను సైబర్‌నేరగాళ్లు దోచుకుంటున్నారు.
సైబర్‌నేరగాళ్లు రోజురోజుకు కొత్త ఎత్తులు వేస్తూ ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్‌నేరాల కట్టడికి, ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు పోలీసులు పలు విధాల ప్రయత్నిస్తున్నా, కొందరు అవగాహన లేకపోవడంతో ఈజీగా సైబర్‌నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. పరువు పోతుందనే భయంతో హడలిపోతూ నేరస్థుల చేతిలో కీలుబొమ్మలా మారుతున్నారు. కేసుల దర్యాప్తుల విషయంలో పోలీసులు ఎక్కడ కూడా డబ్బుల ప్రస్తావన తీసుకురారు, కోర్టులు సైతం నేరుగా ఇలాంటి కేసుల్లో జోక్యం చేసుకోవు. సమాజంలో జరుగుతున్న సైబర్‌నేరాలపై ప్రజలు అవగాహనతో ఉండటంతోనే ఇలాంటి ఘటనలకు చెక్ పెట్టవచ్చు.
ఫోన్లలో విచారణ చేయడం, నోటీసులు పంపించి అరెస్ట్ చేయడమనేది ఉండదు. పోలీసులు ఎవరు కూడా డబ్బుల ప్రస్తావన తీసుకురారు. ఢిల్లీ, ముంబై, బెంగళూర్ పోలీసులమంటూ ఫోన్లు చేసి బెదిరిస్తే బెదరొద్దు.. ఎవరు కూడా వీడియో కాల్స్ చేసి పోలీసులమని చెప్పుకోరు. నకిలీ పోలీసులే హడావుడి చేస్తుంటారు. పోలీసులమంటూ చెప్పుకొని ఫోన్లలో బెదిరిస్తే వెంటనే బాధితులు స్థానిక పోలీసులను సంప్రదించండి. పోలీసులు ఎవరు కూడా బ్యాంకు ఖాతాల వివరాలు అడుగరు, ఫోన్లలో కేసుల విచారణలు జరుగవు, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి.
మోసం చేసేందుకు సైబర్‌నేరగాళ్లు రకరకాల ఎత్తులు వేస్తుంటారు. ఎవరైనా పోలీసులమని, కోర్టు నుంచి అని ఫోన్లు చేస్తే ఫోన్లు కట్ చేసి వెంటనే స్థానిక పోలీసులను సంప్రదించండి. భయపడి డబ్బులు ఇవ్వొద్దు, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వొద్దు, ఎవరైనా ఫోన్ చేస్తే దైర్యంగా మాట్లాడండి.. వాట్సాఫ్‌లో ఫోన్ కాల్స్ వస్తే కట్ చేయండి. డిజిటల్ అరెస్ట్లుండవు, సైబర్‌నేరగాళ్లు రోజుకోరకంగా మోసాలకు పాల్పడుతున్నారు, అవగాహనతో ఇలాంటి మోసాలకు దూరంగా ఉండండి. మీకు ఇలాంటి ఫోన్ కాల్ వచ్చిందంటే వెంటనే మీకు తెలిసిన వారితో కుటుంబ సభ్యులతో చర్చించండి.
– రాచకొండ పోలీస్ కమిషనర్, సుధీర్‌బాబు