సిటీబ్యూరో, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ): టెలిగ్రామ్ యాప్‌లో పెద్దమొత్తంలో గూడ్స్ సైప్లె చేస్తామని చెప్పి నగరానికి చెందిన ఒక వ్యాపారి నుంచి సైబర్ నేరస్తులు రూ.39.7లక్షలు కొట్టేశారు. నగరంలోని మెహదీపట్నంకు చెందిన 28ఏళ్ల వ్యాపారి సోషల్ మీడియా వేదికల ద్వారా పెద్దమొత్తంలో వస్తువులను ఆర్డర్ చేసి వాటి ద్వారా బిజినెస్ చేస్తాడు. ఇదే క్రమంలో టెలిగ్రామ్ యాప్ ద్వారా తక్కువ రేట్లో వస్తువులు అందిస్తామంటూ ఆఫర్ రావడంతో వారితో రూ.30లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు.
ఆ తర్వాత వారు చెప్పిన విధం గా అడ్వాన్స్‌గా రూ.9,99, 990లు చెల్లించగా, మరో రూ.3లక్షలు పంపమని నేరగాళ్లు అతనిని అడిగారు. ఆ డబ్బులు కూడా పంపించిన తర్వాత దఫాలవారీగా వారు అడిగిన డబ్బులు పంపించారు. ఆ తర్వాత నేరగాళ్లు స్పందించకపోవడంతో పాటు ఎలాంటి వస్తువులు పంపించకపోవడంతో తాను మోసపోయానని వ్యాపారి గ్రహించాడు. ఈ వ్యవహారంలో తాను రూ.39,74,989 లక్షలు మోసపోయినట్లు బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి ఫేక్యాప్లో పెట్టుబడులు పెట్టిన నగరవాసి దగ్గర నుంచి రూ.9.65లక్షలను సైబర్‌నేరగాళ్లు కొట్టేశారు. లకిడీకాపూల్కు చెందిన 46ఏళ్ల వ్యక్తి ఇన్స్టాగ్రామ్ బ్రౌజింగ్ చేస్తున్న క్రమంలో షేర్ట్రేడింగ్లో పెట్టుబడులు పెడితే అధికలాభాలు వస్తాయంటూ ప్రమోట్ చేసిన రీల్ చూశారు. ఆ రీల్ చూసి ఆకర్షితుడై అక్కడ ఇచ్చిన ఫోన్‌నెంబర్‌ను సంప్రదిస్తే అతడిని ఒక వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేశారు.
నేహ అయ్యర్ అనే మహిళ బాధితుడిని సంప్రదించి నోమురా యాప్ ద్వారా పెట్టుబడులు పెట్టాలంటూ సూచించింది. దీంతో అతను రూ.9,65 ,400 లక్షలు పంపగా ఆ యాప్‌లో అతడికి రూ.27,51 ,400 లక్షలు లాభం వచ్చినట్లు చూపించింది. ఈ డబ్బులను విత్ డ్రా చేయాలని చూస్తే బ్లాక్ అయి ఉండడంతో బాధితుడు నేరగాళ్లను సంప్రదించాడు. వారు మరో రూ.18లక్షలు చెల్లించాలంటూ డిమాండ్ చేయడంతో తాను మోసపోయానని గ్రహించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.