Cyber Crime | సిటీబ్యూరో, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ): మీ ఫోన్‌కు ఇన్సూరెన్స్ పాలసీలు, రెన్యువల్ పేరుతో మెసేజ్‌లు వస్తున్నాయా? ఫోన్‌కాల్స్, లింక్‌లు వస్తున్నాయా? అయితే జాగ్రత్త. ఇది సైబర్ దొంగల పని అయ్యే అవకాశం ఎక్కువ. ఏమరుపాటున ఆ లింకులను క్లిక్ చేస్తే ఇక నిండా మునిగినట్లే! అని హెచ్చరిస్తున్నారు సైబర్ క్రైం పోలీసులు. ఇప్పటివరకు వివిధ రూపాల్లో ఆశలు పెట్టి మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు బీమా రంగంపైనా వల విసురుతున్నారు. బీమా బదలాయింపులు, సాంకేతిక సమస్యల సాకుతో, రెన్యువల్స్ పేరుతో సైబర్ దొంగలు మోసాలకు పాల్పడుతున్నారు.
ప్రముఖ బీమా కంపెనీల పేర్లతో నకిలీ ఈ-మెయిల్స్, మెసేజ్‌లు పంపి డబ్బులు కొల్లగొడుతున్న సంఘటనలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయాయని సైబర్‌క్రైమ్ పోలీసులు తెలిపారు. గత మూడు నెలల్లో సైబర్ పీఎస్‌కు వచ్చిన కేసుల్లో ఈ తరహా కేసులు దాదాపు 30శాతం ఉన్నాయని వారు పేర్కొన్నారు. మార్చి నెలాఖరులోగా గడువు ముగుస్తుందంటూ, ఒకవేళ కట్టకపోతే కట్టిన పాత డబ్బులు పోతాయంటూ బెదిరించి వారు పంపే లింక్‌లలో డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఇలా కట్టి మోసపోయిన బాధితుల్లో ఎక్కువగా విద్యావంతులు, వృద్ధులు ఉండటం గమనార్హం.
ఇలాంటి మోసాలు వారంలో ఒకట్రెండు జరుగుతూనే ఉన్నాయని, ఈ మధ్యలో ఇవి మరిన్ని పెరిగాయని సైబర్‌క్రైం పోలీసులు చెప్పారు. ఇన్సూరెన్స్ వివరాలు, వాటి గడువు, ఇతరత్రా సమాచారం అటు పాలసీదారులకు, ఇటు ఇన్సూరెన్స్ కంపెనీలకు మాత్రమే తెలుస్తాయి. అయితే సైబర్ నేరగాళ్లు ఈ వ్యక్తిగత సమాచారాన్ని అడ్డదారుల్లో కొనుగోలు చేస్తున్నారు. డేటా ప్రొవైడర్లు, బ్రోకింగ్ కంపెనీలు రూ.10వేల నుంచి రూ.50వేల వరకు డబ్బులు ఇస్తే లక్షలాది మంది పాలసీదారుల వివరాలను అందిస్తున్నాయి. ఇందులో పాలసీ వివరాలు, వాటి గడువు, వాహనాల నంబర్లు, వాటి ఇన్సూరెన్స్ పాలసీలు.. ఇలా పూర్తిగా వ్యక్తిగత వివరాలు ఉంటున్నాయి.
ఈ సమాచారంతో సైబర్ నేరగాళ్లు పాలసీదారులకు ఫోన్లు చేస్తూ, మెసేజ్‌లు పంపుతూ కొత్త బీమా, రెన్యువల్‌తో అధిక లాభాలు, బహుమతులు అందుకోవచ్చని ఆశ చూపుతున్నారు. కొంతమంది పాలసీదారులను నమ్మించి బ్యాంక్ ఖాతా వివరాలను సేకరిస్తున్నారు. ఆ తర్వాత వారి అకౌంట్లలో ఉన్న డబ్బులు కొట్టేస్తున్నారు. ఇటువంటి వాటిలో రిటైర్డ్ ఉద్యోగులు, పాలసీ దగ్గరపడి కొన్నిరోజుల్లోనే అయిపోతుందనుకున్నవారు ముందస్తుగా చెల్లిస్తే మీకు బహుమతులు వస్తాయంటూ ఆశపెట్టడంతో వారు ఇలాంటి ప్రలోభాలకు లొంగిపోయి తమ ఖాతాల వివరాలు చెబుతున్నట్లు సైబర్ పోలీసులు తెలిపారు.
సైబర్ నేరగాళ్లు మొదట ఫోన్ చేసి రెన్యువల్స్, పాలసీలపై మాట్లాడి ఆ తర్వాత అవసరమైతే కొత్త పాలసీల విషయాలు చెప్పి అందుకు వారి వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారు. అటువంటి సందర్భంలో అలా చేసిన వారు సైబర్ మోసగాళ్లే అని గ్రహించమంటున్నారు సైబర్ పోలీసులు. ఎట్టి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ కంపెనీలు రెన్యువల్స్, పాలసీ బదలాయింపు పేరుతో పంపే మెసేజ్, ఈ-మెయిల్స్‌లో పేమెంట్స్ లింక్స్ ఇవ్వవని, ఇన్సూరెన్స్ వెరిఫికేషన్ కోసం పాన్, ఆధార్ నంబర్లు, బ్యాంక్ వివరాలు అడగవని, ఇలా అడిగారంటే అది మోసమేనని గుర్తించాలని వారు చెప్పారు.
ఇన్సూరెన్స్‌కు సంబంధించి ఎలాంటి విషయమైనా సదరు ఏజెంట్‌ను స్వయంగా కలిసి కానీ, లేక సంస్థ ఆఫీసులకు వెళ్లి అక్కడ వివరాలు తీసుకోవాలి తప్ప ఆన్లైన్లో వచ్చే ఏ మెసేజ్‌లకు స్పందించవద్దని పోలీసులు సూచించారు. మరోవైపు ఎల్ఐసీ ఇండియా యాప్ అని చూపించే ఫేక్ యాప్‌ను మీరు ఉపయోగిస్తే, చూసిన వెంటనే తమకు సమాచారం ఇవ్వాలంటూ ఎల్ఐసీ ఇటీవల నోటీస్ జారీ చేసింది. ఎల్ఐసీ పేరుతో కనిపించే ఇలాంటి యాప్స్ నిజంకాదని తెలిపింది. దీనివల్ల డబ్బులు కోల్పోయే ప్రమాదముందని, ఇలాంటి మొబైల్ యాప్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.