సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): అటూ అమెరికా.. ఇటూ ఇండియా స్టాక్ మార్కెట్ల లో భారీగా ఒడిదొడుకులున్నాయి. ఇదే సమయం లో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించడంటూ నమ్మిస్తూ సైబర్ నేరగాళ్లు అందిన కాడికి దోచేస్తున్నారు. తాజాగా ఓ ప్రైవేట్ ఉద్యోగికి సైబర్‌నేరగాళ్లు రూ. 50 లక్షలు మోసం చేశారు. మీర్‌పేట్‌కు చెందిన డిగ్రీ చేసిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఫేస్బుక్ బ్రౌజింగ్ చేస్తుండగా అస్క్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ అనే పేరుతో ఒక ప్రకటన చూసి దానిని క్లిక్ చేయడంతో ఒక వాట్సాప్ గ్రూప్‌నకు తన నంబర్ యాడ్ అయ్యింది. ఆ తరువాత ప్లే స్టోర్ లింక్‌తో యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోమని చూపిస్తూ అస్క్ మిన్ యా ప్ను డౌన్లోడ్ చేయించారు.
ఆ తరువాత 881 అస్క్ ఇన్సైడర్ స్ట్రాటజీ ఎక్ఛేంజ్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్‌లో నంబర్ యాడ్ చేసి ట్రేడింగ్ గూర్చి చర్చించుకుంటున్నారు. ఇప్పుడే సరైన సమయం.. మీరు ఇన్వెస్ట్ చేసేందుకు అంటూ ప్రస్తుతం అమెరికా, భారత్‌లో జరుగుతున్న పరిణామాలపై చర్చించుకుంటూ ట్రేడింగ్‌లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలని సూచనలు చేశారు. దాంతో పాటు ఐపీఓలు తీసుకోవాలంటూ నమ్మిస్తూ మొదట తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టిస్తూ లాభాలు వచ్చాయంటూ కొంత మొత్తాన్ని డిపాజిట్ చేశారు. ఇప్పుడు మీరు ఐపీఓలు తీసుకోవాలంటూ సూచనలు చేస్తూ లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించారు.
ఐపీఓలు తీసుకోవాలంటూ మీకు 62,000 షేర్స్ అలాట్ అయ్యాయని వాటికి రూ. 58 లక్షలు చెల్లించాలని, మీ వద్ద డబ్బు లేకుంటే లోన్ వస్తుందంటూ నమ్మించారు. అయితే యాప్‌లో వాటి విలువ ఒక్కసారిగా పెరుగతూ రూ. 3.5 కోట్లు చూపించింది. అయితే మీరు తీసుకున్న లోన్ క్లియర్ అయిన తరువాత ఆ డబ్బు విత్ డ్రా చేసుకోవాలని నేరగాళ్లు సూచనలు చేసి బాదితుడి వద్ద నుంచి రూ. 50 లక్షలు వసూలు చేశారు. మరింత డబ్బు చెల్లించాలంటూ డిమాండ్ చేయడంతో ఇదంతా మోసమని గుర్తించి, రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.