బంజారాహిల్స్,మే 22: ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో నమ్మించి డబ్బులు దండుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని జహీరానగర్‌లో నివాసం ఉంటున్న సబ్రీన్ అహ్మద్ అనే గృహిణి రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తున్న సమయంలో ఆన్లైన్ ట్రేడింగ్ద్వారా ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించవచ్చు అంటూ ప్రకటన కనిపించింది. లింక్‌ను క్లిక్ చేయగా దానిలో సూచించిన మేరకు వాట్సాప్ ట్రేడింగ్ కోసం మూడు దఫాలుగా రూ.65వేలు సబ్రీన్ అహ్మద్ పంపించింది. డబ్బులు పంపిన తర్వాత లింక్ కనిపించకపోవడంతో పాటు ఎవరూ స్పందించకపోవడంతో తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించిన బాధితురాలు గురువారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
స్నేహితుడి వాట్సాప్ డీపీతో ..
స్నేహితుడి వాట్సాప్ డీపీతో వచ్చిన మెసేజ్ ద్వారా రూ.98వేలు కాజేసిన ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని అమృతా వ్యాలీలో నివాసం ఉంటున్న సయ్యద్ నవాజ్ హుస్సేన్ అనే వృద్ధుడికి రెండునెలల క్రితం గుర్తుతెలియని ఫోన్ నంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అతడి స్నేహితుడి డీపీతో వచ్చిన మెసేజ్‌లో అర్జెంట్‌గా మెడికల్ ఎమర్జెన్సీ ఉందని, తన నెంబర్‌కు రూ.98వేలు పంపించాలని ఆగంతకుడు కోరాడు. నవాజ్ హుస్సేన్ గూగుల్ పే ద్వారా డబ్బులు పంపించాడు. కాసేపటికి స్నేహితుడికి కాల్ చేసి వాకబు చేయగా తాను ఎలాంటి మెసేజ్ చేయలేదని చెప్పడంతో సైబర్ మోసానికి గురైనట్లు తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.