సిటీబ్యూరో, జూలై 4(నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు ఫేక్ వాట్సాప్ డీపీలతో మోసాలు చేస్తున్నారు. ఈ మోసానికి కేవలం సామాన్యులే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, జడ్జీలు, ఆర్మీ అధికారులు.. ఒకరేమిటి.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. తాజాగా ఐఏఎస్ అధికారిణి డా.జి.సృజన పేరుతో ఒక ఫేక్ వాట్సాప్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అధికారులను డబ్బులు అడుగుతూ వేరే నంబర్ల నుంచి మెసేజ్ పెట్టినట్లుగా సైబర్ క్రైమ్ ఆమె పర్సనల్ సెక్రటరీ మణికంఠేశ్ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సృజన పేరుతో నేపాల్‌కు సంబంధించిన ఫోన్ నంబర్‌తో ఒక ఫేక్ ఐడీ క్రియేట్ చేసి ఫేక్ వాట్సాప్ అకౌంట్ రన్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ముగ్గురు జిల్లా సంక్షేమ అధికారులకు అర్జెంట్‌గా ఆర్థిక సహకారం అందించాలంటూ ఆమె పేరుతో వచ్చిన మెసేజ్‌లతో అధికారిణి అలర్ట్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. సైబర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల ఒక జడ్జి పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి డబ్బులు కొట్టేయగా, ఆర్మీ అధికారి ప్రొఫైల్ పెట్టి డబ్బులు కొట్టేసిన ఘటనలు హైదరాబాద్ నగరంలో జరిగాయి. ముఖ్యంగా సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన పెరగడంతో నేరగాళ్లు పాత పద్ధతుల్లో డబ్బు కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలిసిన వ్యక్తుల ఫొటోలను డీపీలుగా పెట్టుకుని నగదు కొట్టేస్తున్నారు.
ప్రముఖులు, పోలీసులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితుల వాట్సాప్ డీపీలతో మెసేజ్‌లు పంపి మోసం చేస్తున్నారు. అత్యవసరంగా డబ్బులు అవసరం పడిందని, ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చానని, పోలీసు కేసులో ఇరుక్కున్నామంటూ ఇలా అబద్ధపు మాటలతో ఏమారుస్తున్నారు. ఈ తరహా మోసాలలో కంపెనీల ఉద్యోగులు, కిందిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులే లక్ష్యంగా జరుగుతున్నాయి.
డేటా బయటకు పోవడంతోనే ఇలా..
కొన్ని సంస్థలు హెచ్ఆర్, శాలరీల చెల్లింపులు, వివిధ అవసరాలు, సేవలకు థర్డ్ పార్టీ ఏజెన్సీలను ఉపయోగించుకుంటాయి. ఈ ఏజెన్సీలు అవసరాన్ని బట్టి కంపెనీ అంతర్గత విషయాలు, ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నాయి. ఇవి గోప్యంగా ఉంచాల్సిన కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ తరహా మోసాలు జరుగుతున్నాయని సైబర్ పోలీసులు చెప్పారు.
ఆయా కంపెనీల ఉద్యోగుల చేతివాటం, డబ్బుకు ఆశ పడటం మూలంగా కంపెనీల డేటా మొత్తాన్ని ఇతరులకు విక్రయిస్తున్నారు. సంస్థల పుట్టుపూర్వోత్తరాలు, ఉద్యోగుల వివరాలు చేజిక్కించుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఓపెన్ సోర్స్‌లో ఉండే ప్రముఖుల ఫొటోలను డీపీలుగా పెట్టుకుని వాట్సాప్ ద్వారా గాలం వేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నకిలీ ఐడీల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, తమకు ఎవరైనా నకిలీలు మెసేజ్ చేసినా, కాల్ చేసి ఆర్థిక సహాయం కావాలని అడిగినా, పర్సనల్ వివరాలు పెట్టమన్నా వెంటనే తమకు సమాచారమందించాలని సైబర్ పోలీసులు తెలిపారు.