సిటీబ్యూరో, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ ట్రేడింగ్‌లో సలహాలిచ్చి రెట్టింపు లాభాలిస్తామంటూ ఆశపెట్టి లక్షల రూపాయల్లో పెట్టుబడులు పెట్టించి చివరకు టోపీ పెట్టేస్తున్నారు. పార్ట్‌టైమ్ జాబ్ ఇస్తామంటూ గూగుల్‌లో అభిప్రాయాలు రాయాలంటూ చార్జీల పేరుతో వసూలు చేసి ఆ తర్వాత చేతులెత్తేస్తున్నారు. బంగారం ధర పెరుగుతున్న సమయంలో తక్కువ ధరకే ఇస్తామంటూ నమ్మించి లక్షల్లో మహిళలను దోచేస్తున్నారు. ఇలా ఆన్లైన్ మాయగాళ్ల వలలో పడి మోసపోతున్న బాధితుల సంఖ్య హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతోంది. అయితే తమ బాధలు పోలీసులకు చెప్పుకోలేక.. ఇంట్లో బయటపెట్టలేక సతమతమవుతూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఆ తర్వాత దవాఖాన పాలవడమో.. లేక తనువు చాలించడమో జరుగుతోంది. సిటీలో ఈ మధ్యకాలంలో జరిగిన చాలా కేసుల్లో ఇదే పరిస్థితి వెలుగుచూస్తోంది.
మచ్చుకు కొన్ని కేసులిలా..
హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ ఆన్లైన్లో తనను సంప్రదించిన వ్యక్తిని నమ్మి మోసపోయింది. బంగారం విషయంలో ఆన్లైన్లో సెర్చ్ చేయడాన్ని గమనించిన సైబర్మోసగాడు ఆమెను సంప్రదించి తక్కువ ధరకే బంగారం విక్రయిస్తామని, మొదట ఇచ్చినట్లే ఇచ్చి ఆ తర్వాత లక్షలు పెట్టుబడి పెట్టించి ముఖం చాటేయడంతో ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై గుండెపోటుతో మరణించింది.
– ఉన్నత హోదాలో రిటైరయిన హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి ఆన్లైన్ ట్రేడింగ్‌లో లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయారు. తనకు ట్రేడింగ్‌లో సలహాలిచ్చి రెట్టింపు లాభాలు వచ్చేలా చేస్తామని, అందుకు టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ చేసి ఆ తర్వాత మొదట లాభాలిచ్చినట్లే ఇచ్చారు. దీంతో అతను రూ.82లక్షలు పెట్టుబడి పెట్టాడు. సైబర్ నేరగాళ్ల నుంచి స్పందన లేకపోవడంతో అతను తీవ్ర ఒత్తిడికి గురై అధిక రక్తపోటుతో వైద్యశాలలో చేరాడు. ఇప్పటికీ అతని డబ్బులు రికవరీ కాలేదు.
– ఆన్లైన్ టాస్క్ ద్వారా నెలకు రూ.30వేలు సంపాదించి తన భర్తను ఆశ్చర్యపర్యాలనుకుంది ఓ గృహిణి. హైదరాబాద్‌లో ఉన్నత వర్గాలు ఎక్కువగా ఉండే ఓ ప్రాం తానికి చెందిన విద్యావంతురాలైన ఆమె అందినచోటల్లా అప్పులు తెచ్చి వడ్డీలు కట్టింది. తన దగ్గరున్న బంగారం కూడా తాకట్టుపెట్టి మరీ డబ్బులు చెల్లించింది. అయితే తీరా సైబర్ కేటుగాళ్లు ఆమెకు చేయివ్వడంతో తన భర్తకు తెలిస్తే గొడవ అవుతుందని భావించి భర్త పైనే వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తీరా కౌన్సెలింగ్‌లో ఆన్లైన్ మోసానికి సంబంధించిన విషయం బయటపడడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇద్దరు భార్యాభర్తలకు సర్దిచెప్పి సైబర్ నేరగాళ్లపై కేసు నమోదు చేసి వారిని ఇంటికి పంపించేశారు.
– పార్ట్‌టైమ్ జాబ్‌ల పేరుతో నగరానికి చెందిన ఒక యువకుడు ఆన్లైన్ చార్జిలు కట్టాడు. ఫేక్ లెటర్లు, ఐడీ కార్డులు వచ్చిన తర్వాత నమ్మి ఆన్లైన్ జాబ్ వచ్చిందంటూ సంబురపడిపోయాడు. మూడు నెలలైనా డబ్బులు రాకపోవడంతో తనకు కాల్ చేసిన వ్యక్తులను సంప్రదించా డు. కానీ వారు స్పందించకపోవడంతో మానసిక ఒత్తిడికి గురై ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. దీంతో ఇంట్లోవారు పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారి దర్యాప్తులో ఈ తతంగం వెలుగుచూసింది. ఇప్పటివరకు యువకుడి జాడ దొరకలేదని పోలీసులు చెబుతున్నారు.
వారానికి 10 కేసులు..
ఆర్థికనేరాలు, సైబర్ మోసాల్లో అధిక శాతం హైదరాబాద్ నగరానికి చెందిన ప్రజలు మోసపోతున్నారు. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారానికి పదికేసులు ఇలాంటివే నమోదవుతున్నాయి. ఇలాంటి ఫిర్యాదులు వెలుగుచూసినవి తక్కువేనని, పోలీసులకు చెబితే ఏమవుతుందోనని చాలామంది తమ వరకు రావడం లేదంటూ సైబర్ పోలీసులు చెబుతున్నారు. బాధితుల్లో సంపన్నులు, మధ్యతరగతి, విశ్రాంత ఉద్యోగులే ఎక్కువగా ఉంటున్నారని, ఆకర్షణీయమైన ప్రకటనలు, సైబర్‌నేరగాళ్ల మాయమాటలు నమ్మి తమ పరిధి దాటి పెట్టుబడులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఈ కేసుల్లో సున్నిత మనస్కులు కఠిన నిర్ణయాలు తీసుకుంటే, మరికొందరు మానసిక ఒత్తిడితో ఆసుపత్రి పాలవుతున్నారు.
తక్షణమే స్పందించని బాధితులు..
సైబర్ మోసాల్లో బాధితుల నుంచి తక్షణ స్పందన కరువవుతున్నదని సైబర్ పోలీసులు చెప్పారు. తాము మోసపోయామని గ్రహించిన వెంటనే తమను సంప్రదించకుండా అనవసరంగా ఆలస్యం చేస్తూ మానసిక ప్రశాంతత కోల్పో యి కుటుంబాల్లో కలహాలు పెంచుకుంటున్నారని వారు విశ్లేషించారు. ముఖ్యంగా ఈ కేసుల్లో మహిళలు, విశ్రాంత ఉద్యోగులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని గుర్తించారు. మోసం జరగగానే ఫిర్యాదు చేస్తే నగదు రిఫండ్ సులువవుతుందని, ఆలస్యమైతే రికవరీ చాలా కష్టమవుతుందని చెప్పారు.
ఆలస్యం చేయడం వల్ల నిందితులు ఆ సొమ్మంతా వేర్వేరు దేశాల్లో ఉన్న ఖాతాల్లోకి మళ్లిస్తున్నారని, క్రిప్టోగా మారి విదేశాలకు తరలించాక రికవరీ అసాధ్యమని పేర్కొన్నారు. బాధితులు వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1930కి కానీ, రూ.లక్షన్నరలోపు నష్టపోతే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో, అంతకుమించితే సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.