బంజారాహిల్స్, ఫిబ్రవరి 28: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళాకు వెళ్లాలనుకున్న వ్యక్తికి గది ఇప్పిస్తానంటూ నమ్మించి మోసం చేసిన సైబర్ నేరగాడిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్న వీవీకే.రమణ ప్రసాద్ అనే వ్యక్తి కుటుంబంతో సహా ప్రయాగ్‌రాజ్ వెళ్లాలనుకుని వసతి కోసం ఫిబ్రవరి 11న ఆన్లైన్లో సెర్చ్ చేస్తుండగా ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి దర్శన్ అనే హోటల్‌కు సంబంధించిన వివరాలు కనిపించాయి.
ఉత్తరప్రదేశ్ టూరిజం కార్పొరేషన్‌కు చెందిన హోటల్ అని ఉండటంతో ఫోన్ చేయగా.. శ్రీకాంత్ అనే వ్యక్తి లైన్లోకి వచ్చాడు. ఫిబ్రవరి 15న తాము అక్కడికి చేరుకుంటామని చెప్పగా.. రెండు రూమ్‌లు సిద్ధంగా ఉన్నాయని నమ్మబలికాడు. రూ.30,500 చెల్లించాలని క్యూ ఆర్ కోడ్ పంపించాడు. గదులు బుక్ అయ్యాయని మెసేజ్ పంపించాడు. కాగా, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ దర్శన్ హోటల్‌కు వెళ్లగా.. వారి పేర్లమీద ఎలాంటి రూమ్ బుకింగ్ కాలేదని తేలింది. శ్రీకాంత్ అనే వ్యక్తి ఎవరో తమకు తెలియదని నిర్వాహకులు చెప్పారు. దీంతో వేరే హోటల్లో గదులు తీసుకున్న రమణ ప్రసాద్ తాము మోసపోయినట్లు గుర్తించారు. బాధితుడు శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.