స్నేహితుడినంటూ పరిచయం చేసుకున్న సైబర్ నేరగాడు ఓ యువతికి రూ.6 లక్షలు టోకరా వేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఓ యువతి బ్యాంకు పరీక్షల కోసం వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఇనిస్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకుంది. అయితే 2019లో సోషల్‌మీడియా ద్వారా ఓ వ్యక్తి తాను పలానా ఇనిస్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకున్నానని, మీ స్నేహితుడినంటూ పరిచయమయ్యాడు. ఇద్దరు కొన్నాళ్లు చాటింగ్ చేశారు. తాను సౌదీ అరేబియాలో ఉంటున్నానని, మంచి ఉద్యోగం చేస్తున్నానని చెప్పాడు. కొన్నాళ్లకు ఇద్దరు పెండ్లి చేసుకోవాలనుకున్నారు.
ఈ క్రమంలోనే తాను సౌదీ అరేబియాలో వ్యాపారం చేయాలని నిర్ణయించానని, రూ.6 లక్షలు అవసరమున్నాయంటూ కోరాడు. దానికి బాధితురాలు అంగీకరించింది. అయితే నేరుగా సౌదీ అరేబియాకు ఆ డబ్బు పంపితే ఇబ్బంది అవుతుందని, కరీంనగర్లో ఉండే తన స్నేహితుడి ఖాతాకు పంపిస్తే, అతడు తనకు ఏదో విధంగా డబ్బు చేరవేస్తాడంటూ నమ్మించాడు. ఇందులో భాగంగానే ఆమె ఆ డబ్బును కరీంనగర్లో ఉండే మరో వ్యక్తి ఖాతాకు పంపించింది. ఈ ఖాతాదారుడికి సౌదీ అరేబియా నుంచి ఫోన్ చేసిన నిందితుడు మనమిద్దరం చిన్ననాటి స్నేహితులమంటూ పరిచయం చేసుకొని, అతడి ఖాతాను బాధితురాలికి ఇచ్చాడు.
కరీంనగర్‌కు మరో వ్యక్తిని పంపించి ఆ డబ్బును ఖాతాదారుడి వద్ద నుంచి తీసుకొని, అప్పటి నుంచి బాధితురాలితో అంటీ ముట్టనట్లు ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే బాధితురాలు రెండు మూడు సార్లు వార్నింగ్ ఇవ్వడంతో లక్ష రూపాయలు ఆమె ఖాతాలోకి బదిలీ అయ్యాయి. మిగతా డబ్బు కోసం ప్రయత్నిస్తుండగా నిందితుడు ఫోన్ స్విచాఫ్ చేశాడు. ఇదంతా మోసమని గుర్తించిన బాధితులు సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
కరీంనగర్‌కు చెందిన ఖాతాదారుడిని పిలిపించి ప్రశ్నించగా తనకు ఏమి తెలియదని, చిన్ననాటి స్నేహితుడినంటూ పరిచయం చేసుకొని తన బ్యాంకు ఖాతాలో డబ్బు డిపాజిట్ చేసి, మరో వ్యక్తికి ఇవ్వాలని సూచించడంతో తాను అదే విధంగా చేశానంటూ చెప్పాడు. ఇప్పుడు ఆ డబ్బు తీసికెళ్లిన వ్యక్తి ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. దీంతో నిందితుడు సౌదీఅరేబియాలో ఉన్నాడా? డబ్బు తీసుకువెళ్లిన వ్యక్తే నిందితుడా? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.