సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): పొరుగు రాష్ర్టాల్లో తిష్టవేసి, నగరంలోని అమాయక ప్రజల కష్టార్జితాన్ని ఆన్లైన్ ద్వారా గద్దల్లా తన్నుకుపోతున్నారు సైబర్ నేరగాళ్లు. సైబర్ మోసాలపై ఎంత అవగాహన కల్పించినా, ప్రతిరోజూ ఏదో ఒకచోట పదుల సంఖ్యలో జనం సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
ఈ క్రమంలోనే సైబరాబాద్ పరిధిలో ఆన్లైన్ మోసాలకు గురై లక్షల రూపాయలు పొగొట్టుకున్న బాధితుల ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేసి, వివిధ రాష్ర్టాల నుంచి వారం రోజుల్లోనే నలుగురు నేరగాళ్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.21.98 లక్షలను రికవరీ చేయడమే కాకుండా నిందితులు వినియోగించిన 5 సెల్ఫోన్లు, మొబైల్ వాల్ చార్జర్, స్మార్ట్ వాచ్, 6 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ సైబర్‌క్రైమ్ డీసీపీ సాయిశ్రీ కథనం ప్రకారం… నగరానికి చెందిన ఒక వ్యక్తికి టెలిగ్రామ్ ద్వారా ఒక యువతి పరిచయమైంది. ఈ క్రమంలో సదరు యువతి తన పేరు బెన్సాషాగా పరిచయం చేసుకుంది.
అనంతరం ఫారెక్స్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మబలికింది. అయితే భారతీయ స్టాక్ మారెట్లో తనకున్న పరిమిత అనుభవం కారణంగా బాధితుడు మొదట పెట్టుబడులు పెట్టేందుకు సంకోచించాడు. దీంతో బాధితుడికి నమ్మకం కల్పించేందుకు ఎస్ఎల్బీఆర్జీఎఫ్ఎన్టీ అనే యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసి, దాని ద్వారా పేపర్ ట్రేడ్లు నిర్వహించమని సూచించింది. అంతే కాకుండా సపోర్ట్@ స్పెడెక్స్. కామ్ ద్వారా లాగినై, కొత్త అకౌంట్‌ను తెరిపించింది.
ఈ క్రమంలో జరిపిన ప్రాథమిక ట్రేడింగ్‌లో లాభాలతో నమ్మకం పెరిగిన బాధితుడు స్ప్రెడెక్స్ గ్లోబల్ లిమిటెడ్ అనే టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. అయితే అకడ యుఎస్ డాలర్లలో ట్రేడింగ్ ఉంటుందని సదరు యువతి సూచించడంతో బాధితుడు నేరగాళ్లు అందించిన బ్యాంకు ఖాతాలకు డబ్బును బదిలీ చేశాడు. ఈ క్రమంలో మొదట బాధితుడు రూ.50వేలు పెట్టుబడి పెట్టాడు. దీంతో అతడికి రెండుసార్లు రూ.5వేల చొప్పున లాభాలు వచ్చాయి.
వాటిని విత్‌డ్రా కూడా చేసుకున్నాడు. దీంతో మరింత నమ్మకం పెరిగిన బాధితుడు విడతల వారిగా రూ.10లక్షలు పెట్టుబడి పెట్టాడు. అందుకు సదరు యువతి కూడా అతడికి రూ.10లక్షల లాభం వచ్చినట్లుగా చూపించింది. అయితే తనకు వచ్చిన లాభాలను విత్‌డ్రా చేసేందుకు యత్నిస్తే వచ్చిన లాభాలపై 30శాతం పన్ను కింద రూ.2,68,000, సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.5,75,000, కరెన్సీ మార్పిడి రుసుము కింద రూ.3,60,000 చెల్లించాల్సి ఉంటుందని సైబర్ నేరగాళ్లు సూచించారు.
అది నమ్మిన బాధితుడు ఆ మొత్తం చెల్లించగా సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని, సిబిల్ స్కోర్ పెంచడానికి అదనంగా మరో రూ.15లక్షలు చెల్లించాలని దుండగులు సూచించారు. దీంతో ఖంగుతిన్న బాధితుడు మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో నిందితులు తమ చాట్ హిస్టరీతో పాటు ట్రేడింగ్ ఖాతాను తొలగించారు. అయితే సైబర్ నేరగాళ్లు బాధితుడికి టెలిగ్రామ్ యాప్‌లో 21,93,300 వర్చువల్ లాభాన్ని చూపించి మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడికి సంబంధించిన హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాల నుంచి సైబర్ నేరగాళ్లు సూచించిన వివిధ ఖాతాల్లోకి 21.93లక్షల నగదు మార్పిడి జరిగినట్లు గుర్తించి, వాటిలోని ఒక ఖాతాలో ఉన్న రూ.90వేలను ఫ్రీజ్ చేసి, కోర్టు అనుమతితో బాధితుడికి అందచేశారు. ఈ కేసుకు సంబంధించి సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలను అందచేసిన తుమ్మలూరు సుధాకర్‌రెడ్డి, తుమ్మలూరు రఘునాథరెడ్డిలను సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ట్రేడింగ్ మోసాలకు పాల్పడుతున్న మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు చెప్పారు.