Cyber Crimes | బంజారాహిల్స్, జూన్ 10 : స్నేహితురాలి ఫోన్ నెంబర్‌తో మెసేజ్ పెట్టి అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ వైద్యురాలికి టోకరా వేసిన సైబర్ నేరగాళ్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. యూసుఫ్‌గూడలోని తిరుమల అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న డా.వరలక్ష్మికి గత నెల 15న ఆమె ఫ్రెండ్ డా.మౌనిక పేరుతో మెసేజ్ వచ్చింది. తనకు అత్యవసరంగా రూ.42 వేలు పంపమని, సాయంత్రానికి తిరిగి ఇస్తానంటూ మెసేజ్‌లో కోరింది. మెసేజ్‌లో సూచించిన నెంబర్‌కు జీ పే ద్వారా రూ.42 వేలు పంపించిన డా.వరలక్ష్మి స్నేహితురాలు డా.మౌనికకు స్క్రీన్‌షాట్ తీసి పంపించింది. కాసేపటికి మౌనిక ఫోన్ చేసి తన ఫోన్ గంట క్రితం హ్యాక్ అయిందని చెప్పింది. దీంతో అదే రోజున సైబర్ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మంగళవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.