వెంగళరావునగర్, సెప్టెంబర్ 19ః ప్రముఖ గైనాకాలజీ వైద్యురాలి ఫోన్‌ను సైబర్ క్రిమినల్స్ హ్యాక్ చేశారు. వాట్సాప్ ద్వారా కాంటాక్ట్స్‌లో ఉన్న వారందరికీ రూ.45 వేలు పంపాలని ఆ కేటుగాళ్లు సందేశాలు పంపారు. కొరియర్ పేరిట ఫోన్ చేసి.. ఆమె ఫోన్ నెంబర్‌ను హ్యాక్ చేసి మోసానికి పాల్పడ్డారు. బోరబండ పోలీసుల కథనం ప్రకారం..కళ్యాణ్ నగర్ వెంటర్ వన్‌కు చెందిన ఎల్.జయంతిరెడ్డి(64) జె.జె.దవాఖానాకు చెందిన ప్రముఖ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్‌గా పనిచేస్తుంటారు.
ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం ఓ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. బ్లూ డార్ట్ కొరియర్ సేవల నుంచి కాల్ చేస్తున్నామని.. ప్యాకేజీని డెలివరీ చేయడానికి కొరియర్ బాయ్‌ను ఆదేశించడానికి ఓ నెంబర్‌కు కాల్ చేయాలని చెప్పారు. అనంతరం ఒక కోడ్ వచ్చింది. వెంటనే ఆమె వాట్సాప్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు జీ పే ద్వారా రూ.45 వేలు డబ్బు పంపాలని ఆమె వాట్సాప్ లోని స్నేహితులు, కుటంబ సభ్యులకు మెసేజీలు పంపారు. ఇది గ్రహించిన బాధితురాలు ఎన్సీఆర్పీ పోర్టల్‌తోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఈ మేరకు బోరబండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.