 
                                                            సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టండి.. అధిక లాభాలు సంపాదించడంటూ వాట్సాప్ గ్రూప్‌లో వచ్చిన ప్రకటనను చూసి సైబర్‌నేరగాళ్ల చేతికి చిక్కిన ఓ ఇన్సూరెన్స్ ఏజెంట్ రూ.72 లక్షలు పోగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉప్పల్ ప్రాంతానికి చెందిన బాధితుడి వాట్సాప్ నంబర్‌ను స్టాక్స్ వీఐపీ ఎక్ఛ్సేంజ్ గ్రూప్ ఈ8 పేరుతో యాడ్ చేశారు. అందులో స్టాక్స్‌లో పెట్టుబడికి సంబంధించిన ప్రకటనలు ఇచ్చారు. ఇవి నిజమని నమ్మిన బాధితుడు.. వారు సూచించిన గ్రూప్‌లో చేరాడు.
ఆ తరువాత గ్రూప్ అడ్మిన్ కరీమ్ వర్మ, క్రిస్టెన్ అనే వ్యక్తులు తాము స్టాక్స్‌లో ఎప్పుడు ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే విషయంలో సూచనలు చేస్తామని, తాము రసెల్ల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ తరపున ప్రతినిధులమంటూ మాట్లాడారు. ఆ తరువాత కొన్ని స్టాక్స్ పేరు చెప్పి అందులో పెట్టుబడి పెట్టండంటూ సూచనలు చేశారు. మొదట రూ.50 వేలు పెట్టుబడి పెట్టడంతో అందులో కొద్ది లాభాలు చూపించారు. ఆ తరువాత దఫ దఫాలుగా రూ. 72,03,133 పెట్టుబడి పెడుతూ వెళ్లాడు. కంప్యూటర్ స్క్రీన్‌పై భారీ లాభాలు కన్పించాయి, అందులో నుంచి కొన్ని డబ్బులు డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా ట్యాక్స్‌లు, కమీషన్ చెల్లించాలంటూ షరతులు విధించడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితు డు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
                            