Cyber Crime | సిటీబ్యూరో, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): విదేశీ ఉద్యోగాల పేరుతో ఎర వేస్తున్న సైబర్ నేరగాళ్లు.. అమాయక నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారు. ఏజెంట్ల ద్వారా యువతను కంబోడియాకు రప్పించుకుంటున్న సైబర్ నేరగాళ్లు.. తమ కాల్సెటర్లలో నియమించుకొని వారితోనే నేరాలు చేయిస్తున్నారు. కంబోడియా వెళ్లిన యువత తిరిగి స్వదేశానికి వచ్చేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడికి వెళ్లిన యువత.. తిరిగి స్వదేశానికి రావాలంటే నేరగాళ్లు షరతులు విధిస్తున్నారు. స్వదేశం నుంచి కొత్తవారిని రప్పించాలని.. అప్పుడే అక్కడున్న వారిని విడుదల చేస్తామంటున్నారు. మీరు మీ దేశాలకు వెళ్లిపోతే.. ఇక్కడ పని ఎవరు చేస్తారు.. అంటూ బెదిరిస్తున్నారు. లేదంటే పోలీసులు, కేసుల పేరుతో భయపెడుతున్నారు. దీంతో యువత అక్కడే బందీలవుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల వెలుగు చూస్తున్నాయి.
ఇంత కాలం ఆయా దేశాల్లో కాల్‌సెంటర్లు నిర్వహించిన సైబర్ నేరగాళ్లు.. ఆ రాష్ర్టాల్లో పోలీసు నిఘా పెరగడంతో రూట్ మార్చుకున్నారు. తాజాగా.. వారి వారి దేశాల్లోనే కాల్‌సెంటర్లు ఏర్పాటు చేస్తూ.. అక్కడి నుంచే నేరాలు మొదలు పెడుతున్నారు. ఇందుకు ఆయా దేశాల్లో తమ ఏజెంట్లను నియమించుకుంటున్నారు. వారి సహాయంతో.. విదేశాల ఉద్యోగాల వేటలో ఉన్న నిరుద్యోగులను ఆకర్శిస్తున్నారు. యువతను వారి వారి దేశాలకు రప్పించుకుంటూ.. వారు నేరాల కోసం ఏర్పాటు చేసుకున్న కాల్ సెంటర్లలో ఉద్యోగాలిస్తున్నారు. వేర్వేరు దేశాల నుంచి అక్కడికి వెళ్లిన యువత ద్వారా వారి వారి ప్రాంతాలకు ఫోన్ కాల్స్ చేయిస్తున్న సైబర్ నేరగాళ్లు.. అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. కోట్లల్లో దోచుకుంటున్నారు. ఇటీవల కంబోడియా కేంద్రంగా జరిగిన మోసాలు వెలుగులోకి వచ్చాయి.
విదేశీ ఉద్యోగం ఆశతో ఏజెంట్ల ద్వారా కంబోడియా వెళ్లి, సైబర్ నేరగాళ్ల కాల్ సెంటర్లలో పనిచేస్తున్న కొంత మంది తిరిగి స్వదేశానికి వచ్చేందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేరగాళ్ల నిజస్వరూపం తెలుసుకున్న కొందరు ఉద్యోగులు.. స్వదేశానికి వచ్చేందుకు అక్కడి కాల్ సెంటర్ల నిర్వాహకుల అనుమతి కోరుతున్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి కాల్ సెంటర్లు ఏర్పాటు చేశాం.. మీరు వెళితే నష్టపోతాం.. అంటూ సర్టిఫికెట్లు లాక్కొంటున్నారని తెలిసింది. ఎవరైనా స్వదేశానికి వెళ్తామంటూ ఒత్తిడి తెస్తే కొన్ని షరతులు విధిస్తున్నారు.
కంబోడియా నుంచి ఒకరు స్వదేశానికి వెళ్తే.. పది మందిని అక్కడ నియమించాలంటున్నారు. స్వదేశంలో ఉన్న తెలిసిన నిరుద్యోగులకు కాల్చేసి.. కంబోడియాలో మంచి ఉద్యోగాలు ఉన్నాయంటూ నమ్మించి కొత్త వారిని అక్కడికి రప్పించాలని షరతులు విధిస్తున్నారు. ఒకరు స్వదేశానికి వెళితే.. పది మందిని కంబోడియాకు రప్పించాలి.. అప్పుడే విడుదల చేస్తామంటూ సైబర్ నేరగాళ్లు హెచ్చరిస్తున్నారు. ఈ షరతులకు తలొగ్గి కొంతమంది తమకు తెలిసిన వారికి కాల్ చేసి.. మంచి ఉద్యోగాలు ఉన్నాయంటూ అక్కడికి రప్పించుకొని.. మోసం చేస్తున్నారు. మరికొంత మంది.. ఇప్పటికే మేము మోసపోయాము.. ఇతరులను మోసం చేయలేము.. అంటూ అక్కడే ఉండి ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది.
సైబర్ నేరగాళ్లు తమ దేశాల్లోనే ఉంటూ.. అక్కడే కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. మన దేశంలోని నిరుద్యోగులను అక్కడికి రప్పించుకొని వారి ద్వారా నిత్యం వందల కోట్లు కొట్టేస్తున్నారు. మన దేశీయులను మోసం చేసేందుకు మన దేశ యువతనే ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా కంబోడియా అడ్డాగా ఈ నేరాలు జరుగుతున్న విషయం ఇప్పటికే వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో ఉద్యోగాలు అనగానే యువత కూడా వెనుకా ముందు ఆలోచించకుండా వెళ్లడం సహజం. యువత ఆశను అవకాశంగా తీసుకుంటున్న సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
ఏజెంట్ల సేవలను వినియోగించుకుంటున్న సైబర్ నేరగాళ్లు.. దుబాయ్, ఆఫ్రికా దేశాల్లో ఉద్యోగాలంటూ.. యువతకు ఎర వేస్తున్నారు. ఆయా దేశాలకు వీసాలు దొరకడం లేదంటున్న ఏజెంట్లు.. పథకం ప్రకారం కంబోడియా పంపిస్తున్నారు. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఉద్యోగాలంటూ నమ్మించి.. కంబోడియాలో ఉన్న సైబర్ నేరగాళ్ల కాల్ సెంటర్లలో పనులు చేయిస్తున్నారు. డబ్బు కోసం అమాయకులను ఎలా బురిడీ కొట్టించాలి.. అన్న అంశంపై శిక్షణ కూడా ఇస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ఉద్యోగం చేయగా.. మరికొందరు నచ్చక పారిపోయి వస్తున్నారు.
విదేశాల్లో ఉద్యోగాలు అనగానే యువత ఎగిరి గంతేస్తారు.. ఏదీ ఆలోచించడం లేదు.. వివరాలు పూర్తిగా సేకరించిన తరువాతే ఆయా ఉద్యోగాల వైపు దృష్టి సారించాలి.. ఏజెంట్ల మాటలు నమ్మి.. ఏదీ తెలుసుకోకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మోసపోతారంటూ దర్యాప్తు సంస్థలు యువతకు సూచిస్తున్నాయి.
శ్రీనివాస్ (పేరు మార్చాం) విదేశీ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ.. సోషల్ మీడియాలో ఒక ప్రకటన చూశాడు. అందులో ఉన్న ఫోన్ నంబర్‌కు మాట్లాడాడు. తాను డిప్లామా చేశానని, తనకు కంప్యూటర్‌పై మంచి పట్టు ఉన్నదంటూ చెప్పాడు. నీకు దుబాయ్, కంబోడియా, శ్రీలంక.. దేశాలలో ఉద్యోగ అవకాశాలున్నాయి.. ఈ మూడు దేశాలలో ఎక్కడ వచ్చినా పోతావా.? అంటూ ప్రశ్నించారు. వెళ్తానంటూ శ్రీనివాస్ చెప్పాడు. నీ పాస్‌పోర్టు, ఎడ్యుకేషన్ సర్టీఫికెట్లతో పాటు ప్రాసెసింగ్ కోసం కొంత డబ్బు కూడా పంపించాలని సూచించారు. అన్ని వారు కోరినట్టు పంపించాడు. కొన్ని రోజుల తరువాత నీకు కంబోడియాలో అవకాశముంది.. ఆ దేశం వీసా ఇప్పిస్తామంటూ చెప్పారు. శ్రీనివాస్ అన్నింటికీ ఒప్పుకొని కంబోడియా వెళ్లాడు. అక్కడ ఒక కాల్సెంటర్లో ఉద్యోగంలోకి చేరాడు. ఎలా మాట్లాడాలి.. ఏ వివరాలు అడుగాలనే అంశాలపై శిక్షణ ఇచ్చారు.
వారం రోజుల తరువాత హైదరాబాద్‌లో ఉండే వారి వివరాలిచ్చి ట్రేడింగ్‌లో మంచి లాభాలొస్తాయంటూ మాట్లాడించారు. శ్రీనివాస్ తేరుకున్నాడు. ఇదంతా మోసమని గుర్తించాడు. తనకు ఈ ఉద్యోగం వద్దని, వెళ్లిపోతానంటూ నిర్వాహకులను కోరాడు. నీవు అగ్రిమెంట్ రాశావు.. నీ పాస్‌పోర్టు మా వద్దనే ఉంది.. వెళ్లడానికి వీలులేదంటూ.. కొన్ని రోజులు బలవంతంగా పని చేయించారు. మీ ప్రాంతంలో ఉన్న వారికి కాల్చేయి.. విదేశాలలో ఉద్యోగాలున్నాయని చెప్పి ఇక్కడకు రప్పించు.. వారు ఇక్కడికి వస్తే.. అప్పుడు నిన్ను విడుదల చేస్తామంటూ షరతులు విధించారు. నీవు ఒక్కడివి వెళ్లాలంటే కనీసం 10 మందిని రప్పించాలని శ్రీనివాస్‌కు సూచించారు. చేసేదేమి లేక తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌పై శ్రీనివాస్ ఏజెంట్ల నంబర్ వేసి ఇతరులను అక్కడికి రప్పించడంలో పరోక్షంగా సహకరించి.. బయటపడ్డాడు. ఇలా కంబోడియాలోని సైబర్‌నేరగాళ్ల కాల్సెంటర్లలో చిక్కుకున్న బాధితులు నిర్భంధం నుంచి బయటపడేందుకు నానా కష్టాలు పడాల్సి వస్తుందంటూ అక్కడి నుంచి వచ్చిన బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.