సిటీబ్యూరో, జూలై 5(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని షేక్‌పేటకు చెందిన 67ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు క్రెడిట్ కార్డు పరిధి పెంచుతామంటూ చెప్పి మోసం చేశారు. గత నెల 30న బాధితుడికి ఒక వ్యక్తి నుంచి వీడియో కాల్ వచ్చింది. క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచుతామని, హెచ్డీఎఫ్సీ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ త్వరలో బాధితుడిని సంప్రదిస్తారని చెప్పారు. కాల్ మాట్లాడుతున్న సమయంలోనే బాధితుడి స్క్రీన్‌ను షేర్ చేయమని అడగడంతో పాటు తాను ఇచ్చిన లింక్‌ను క్లిక్చేయమని అడిగాడు.
ఇదే సమయంలో అతని హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల వివరాలను, అడ్రస్ ప్రూఫ్‌తో నమోదు చేయాలని సూచించాడు. బాధితుడి క్రెడిట్‌కార్డు పరిమితిని రూ.2.5లక్షలకు పెంచుతామని చెప్పడంతో నమ్మిన బాధితుడు అతను సూచించిన విధంగా చేశాడు. మరో 24గంటల్లో ఫోన్‌పే ఖాతాలో ఈ పెరిగిన క్రెడిట్ లిమిట్ కనిపిస్తుందని చెప్పి నేరగాడు కాల్ కట్ చేశాడు. తర్వాత తన అకౌంట్ చూస్తే అందులో రూ.2,03,020 లు పోయినట్లుగా గమనించిన బాధితుడు మొదట 1930కు కాల్చేసి ఆ తర్వాత సైబర్‌క్రైమ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు.