సిటీబ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ): సరైన ఉపాధి అవకాశాలు లేక పోవడంతో నిరుద్యోగ యువత ఎక్కడో ఓ దగ్గర ఉద్యోగం పొందాలని విదేశాలలో డాటా ఎంట్రీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ సైబర్ మాఫియా చేతిలో చిక్కుతున్నారు. అక్కడకు వెళ్లిన నిరుద్యోగ యువత మాఫియా చెప్పినట్లు చేయలేదంటే..గంటల తరబడి ఎండలో నిలబెట్టటం.. కప్ప గంతులు వేయాలంటూ తదితర శిక్షలు విధిస్తూ చిత్ర హింసలకు గురిచేస్తూ తమ దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమవుతుండటంతో ఏదో ఒక ఉద్యోగం సాధించాలని అందుకు సోషల్‌మీడియా, తెలిసిన వారిపై ఆధారపడుతున్నారు. కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టడంతో పాటు, తాము కూడా ఉద్యోగం చేయాలంటే ఎక్కడైతే ఏంటి అనే ధోరణితో తెలిసి, తెలియక చాలా మంది విదేశాల నుంచి నిర్వహించే సైబర్ మాఫియా చేతిలో చిక్కుకొని ఆయా డెన్లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
డాటా ఎంట్రీ పేరుతో విదేశాలలో ఉద్యోగాలంటూ సోషల్‌మీడియాలో ప్రకటనలు ఇస్తూ చైనా సైబర్‌నేరగాళ్లు భారతదేశంలో ఉండే యువతను ఆకర్షిస్తున్నారు. వాట్సాప్, టెలిగ్రామ్లతోనే సంప్రదింపులు జరుపుతూ, ఇక్కడి వారి టైపింగ్ స్పీడ్, ఇంగ్లిష్ స్పీకింగ్ స్కిల్స్‌ను తెలుసుకొని ఎంపికయ్యావంటూ విదేశాలకు పిలిపించుకుంటూ సైబర్నేరాలలో శిక్షణ ఇప్పిస్తున్నారు. అక్కడకు వెళ్లిన వారితో అగ్రిమెంట్లు చేసుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఆయా దేశాలలోని అమాయక పౌరులను ఏదో ఒక విధంగా మాయలో వేసి డబ్బు సంపాదించే సైబర్ నేరాలలో ఉద్యోగాలు చేయిస్తున్నారు.
దుబాయ్, కంబోడియా దేశాలలో గతంలో సైబర్ మాఫియా చేతిలో చిక్కుకున్న తెలుగురాష్ర్టాలకు చెందిన పలువురు గతేడాది మే నెలలో విడుదలయ్యారు. ఇటీవల థాయిలాండ్, మయన్మార్ సరిహద్దులలో భారీ ఎత్తున జరుగుతున్న సైబర్మాఫియాకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ చిక్కుకున్న తెలంగాణకు చెందిన పలువురు యువకులను అక్కడి సైన్యం ఆ మాఫియా నుంచి కాపాడి భారత్‌కు పంపించిన విషయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై తెలంగాణ సైబర్‌సెక్యూరిటీ పోలీసులు కేసులు సైతం నమోదు చేశారు.
ఇటీవల పలువురు యువకులు ఈ సైబర్మాఫియా నుంచి తప్పించుకొని తిరిగి వచ్చారు. అందులో కొందరు డిగ్రీ వరకు చదువుకొని ఉద్యోగం కోసం ఇక్కడ ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. డిగ్రీ అయిపోయి ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడడం కంటే హైదరాబాద్‌లో మరో ప్రాంతంలోను ఏదో ఒక ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించే బాధ్యతలు తీసుకోవాలని భావించారు. ఇందులో సోషల్‌మీడియా ద్వారా కొందరికి థాయిలాండ్,మయన్మార్ లో డాటా ఎంట్రీ ఉద్యోగాలు నెలకు రూ. 50 వేల నుంచి రూ. 75 వేల జీతం ఉంటుందంటూ సోషల్‌మీడియాలో పరిచయస్తులు చెప్పారు.
మరికొందరు ఫలాన చోట ఉద్యోగాలున్నాయంటూ మనకు తెలిసిన వారు చేస్తున్నారంటూ సూచనలు రావడంతో ఆయా నంబర్లలో బాధితులు సంప్రదించారు. డాటా ఎంట్రీ ఉద్యోగం కోసం పలువురు సోషల్‌మీడియా, పరిచయస్తుల ద్వారా చైనా సైబర్నేరగాళ్లను సంప్రదించారు. టైపింగ్ స్పీడ్ టెస్ట్ చేసి, చైనీయులు ఫోన్లో ఇంటర్వ్యూలు సైతం చేశారు. నేరుగా సోషల్‌మీడియాలో పరిచయం అయిన వారికి కొందరికి టికెట్టు ఖర్చు చైనా సైబర్‌నేరగాళ్లు పెట్టుకోగా మరికొందరిని టికెట్ తీసుకొని బ్యాంకాక్ రావాలంటూ సూచనలు చేశారు.అలాగే తెలిసిన వారి ద్వారా ఉద్యోగాలకు ప్రయత్నిస్తే రూ. 60 వేల వరకు బాధితుల వద్ద వసూలు చేసి అందులో కొంత కమీషన్ తీసుకొని, మరికొంత టిక్కెట్టుకంటూ వెచ్చించి పంపించారు.
టికెట్లు తీసుకొని బ్యాంకాక్ వెళ్లిన తరువాత సైబర్‌నేరగాళ్లు బాధితుల కోసం కారు బుక్‌చేసి తమ మనుషుల ద్వారా థాయిలాండ్ సరిహద్దులో మయన్మార్ భూభాగంలో ఉండే సైబర్ దోపిడీకి చెందిన కార్యాలయాల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బాధితుల వద్ద నుంచి పాస్‌పోర్టులు లాక్కొని, ఒక సంవత్సరం కాంట్రాక్టు, మధ్యలో జాబ్ వదిలేస్తే 4 వేల డాలర్ల జరిమానా చెల్లించాలంటూ కండీషన్లు పెట్టి సైబర్‌నేరాలు చేసే ఉద్యోగం ఇచ్చారు. మోసం చేయడంలో మంచి నేర్పరితనం ఉన్న వారికి ప్రోత్సహకాలు ఇవ్వడం, మోసం చేయలేక బాధపడుతున్న వారిపై చిత్రహింసలకు గురిచేయడం, ఎండలో నిలబెట్టడం, కప్పగంతులు వేయించడం వంటివి చేస్తూ బలవంతంగా సైబర్‌నేరాలు చేయించే వారని బాధితులు తెలిపారు.
ఇక్కడ ఉద్యోగాలుంటే తమకెందుకు ఈ కర్మ అంటూ పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. ఇలాంటి పరిస్థితులలో రోజు రోజుకు నిరుద్యోగం పెరిగిపోతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక్కడ కొత్త కంపెనీలు వచ్చి ఉద్యోగ అవకాశావాలు వస్తే విదేశాలలో చిన్న చిన్న ఉద్యోగాల కోసం వెళ్లే పరిస్థితి ఉండదని నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తుంది. చిన్న చిన్న ఉద్యోగాలు ఎక్కడైతే ఏంది జీతం ఇచ్చేవాళ్లు కావాలనే భావనతో ముందుకెళ్తే సైబర్‌కేటుగాళ్ల వలలో చిక్కుకుంటున్నామని, అక్కడకు వెళ్లి సైబర్నేరగాళ్లుగా తయారు కావాల్సి వస్తోందంటూ వాపోతున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు విదేశాలలో ఉద్యోగాలంటూ సోషల్‌మీడియా వేదికగా జరిగే ప్రచారాలపై నిఘాపెట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలంటూ ప్రజలు కోరుతున్నారు.