సిటీబ్యూరో, జూలై 16 (నమస్తే తెలంగాణ): డెబిట్ కార్డు ఆన్లైన్ ఫ్రాడ్‌లో మీపై 17 మంది మహిళలు బెంగుళూర్లోని గాం ధీనగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యిందంటూ సైబర్‌నేరగాళ్లు ఓ మహిళా రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి రూ.11లక్షలు కొట్టేశారు. వివరాల్లోకి వెళ్తే.. అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన బాధితురాలు రిటైర్డు ఉద్యోగి. జూలై 10న ఆమెకు టెలికం డిపార్టుమెంట్(ట్రాయ్) నుంచి ఆకాశ్ కులకర్ణి ఐపీఎస్‌ను మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు.
మీ మొబైల్ నంబర్‌తో డెబిట్‌కార్డు మోసాలు జరిగాయని, దీనిపై బెంగుళూర్లోని గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌లో 17 మంది మహిళ లు ఫిర్యాదు చేశారంటూ మాట్లాడాడు. దీనిపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందని, దానికి సంబంధించి మీకు గౌరవ్ సారధి అనే వ్యక్తి మాట్లాడుతాడంటూ ఫోన్ కట్ చేశాడు. తరువాత మరో వ్యక్తి తన పేరు గౌ రవ్ సారధి అని పోలీస్ డిపార్టుమెంట్ నుంచి మాట్లాడుతున్నానంటూ చెప్పుకున్నాడు.
మీ ఫోన్ నంబర్, ఆధార్‌కార్డులను ఉపయోగించి మోసాలు జరిగాయని బెదిరించాడు. అయితే రూ.30 లక్షలు మీరు ఈ ఖాతాలో డిపాజిట్ చేయాలని, లేదంటే మీ అరెస్ట్‌పై సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీ సు కూడా పంపిస్తున్నాను.. వాట్సప్‌లో చెక్ చేసుకోవాలని సూచించాడు. వాట్సాప్ వీడియో కాల్లోకి వచ్చి మాట్లాడాడు. దీం తో బెదిరిపోయిన బాధితురాలు వెంటనే తన బ్యాంకు ఖాతాలో నుంచి సైబర్‌నేరగాళ్లు సూచించిన ఖాతాలోకి రూ.11లక్షలు డిపాజిట్ చేసింది. ఈ విషయంపై తనకు తెలిసిన వాళ్లతో చర్చించగా ఇదంతా మోసమని చెప్పారు. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.