బంజారాహిల్స్, జూన్ 28: నిరంతరం అభివృద్ధి పథంలో ప్రయాణిస్తున్న హైదరాబాద్ నగరంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు మారుతున్న కాలానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే.రామకృష్ణారావు (CS Ramakrishna Rao) సూచించారు. ప్రతిష్టాత్మక నేషనల్ హెచ్ఆర్డీ నెట్వర్క్ హైదరాబాద్ చాప్టర్ కార్యాలయాన్ని బంజారాహిల్స్ రోడ్ నెం 12లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ కే.రామకృష్ణారావు మాట్లాడుతూ..హైదరాబాద్ నగరంలో అనేక కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలతో పాటు నిర్మాణరంగంలో మంచి పురోగతి సాధిస్తున్న తరుణంలో హెచ్ఆర్ నిపుణులకు మంచి డిమాండ్ ఉందన్నారు.
ఉద్యోగుల ఎంపిక, వారిలోని ప్రతిభను మరింత ప్రోత్సహించి పనితీరును రాబట్టడంలో హెచ్ఆర్ విభాగం కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో పాటు భవిష్యత్తులో కీలకపాత్ర పోషించబోయే ఏఐ తదితర టెక్నాలజీలో నైపుణ్యాలను పెంచుకుంటేనే సరైన ఉపాధి అవకాశాలు పొందగలుగుతామని చెప్పారు. తమ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 58 చాప్టర్లు ఉన్నాయని, 21 వేలమంది హెచ్ఆర్ నిపుణులు సభ్యులుగా ఉన్నారని ఎన్హెచ్ఆర్డీఎన్ జాతీయ అధ్యక్షుడు ప్రేమ్‌సింగ్ పేర్కొన్నారు. ఈ రంగంలోని వారికి అవసరమయ్యే శిక్షణతో పాటు ఇతర అంశాల్లో దోహదపడేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు డా.విపుల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.