శుక్రవారం 30 అక్టోబర్ 2020
Hyderabad - Aug 15, 2020 , 00:20:37

సీఆర్‌పీఎఫ్‌ సేవలు అమోఘం

సీఆర్‌పీఎఫ్‌ సేవలు అమోఘం

మీర్‌చౌక్‌ : దేశ సరిహద్దులో సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల సేవలు అమోఘమని సీఆర్‌పీఎఫ్‌ సౌత్‌ సెక్టార్‌ ఐజీ డాక్టర్‌ టి.శేఖర్‌ అన్నారు. సౌత్‌జోన్‌ ఏడీజీ సంజయ్‌ అరోరా అధ్యక్షతన శుక్రవారం రంగారెడ్డి గ్రూప్‌ సెంటర్‌లో దివ్యాంగ్‌ వారియర్స్‌ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై.. జవాన్ల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కేంద్ర పారామిలటరీ దళాల్లో సీఆర్‌పీఎఫ్‌ది ప్రత్యేక స్థానమన్నారు. దేశ భద్రత విషయంలో రాజీలేని పోరాటం చేయడమే కాకుండా నక్సల్‌, ముష్కరుల ఏరివేతలో ముందు వరుసలో ఉంటారన్నారు. విధినిర్వహణ (కుంబింగ్‌) సమయంలో జవాన్లు విరోచితంగా పోరాడి.. అవయవాలు కోల్పోయిన వారిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. వారికి చేయూతనందిచాలనే ఉద్దేశంతో నైపుణ్య శిక్షణ (స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ) కేంద్రాన్ని ప్రారంభించి తర్ఫీదు ఇస్తున్నదన్నారు. క్రీడల్లో నైపుణ్యం ఉన్నవారికి పారా ఒలంపిక్‌ పోటీల్లో పాల్గొనేందుకు శిక్షణ కూడా ఇస్తున్నదన్నారు. ఈ అవకాశాన్ని అంగవైకల్యం ఉన్న జవాన్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జవాన్లు నిర్వహించిన క్రీడలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి గ్రూప్‌సెంటర్‌ డీఐజీ రఘురాంతో పాటు ఆదిత్యా మెహతా ఫౌండేషన్‌ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.