సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): మద్యం దుకాణాల వద్ద మందుబాబులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మద్యం దుకాణాల పరిసర ప్రాంతాలలో సిట్టింగ్లేస్తూ బార్లను తలపించేలా వ్యవహరిస్తున్నారు. చీకటి పడిందంటే చాలు రాత్రి 11 గంటల వరకు ఆయా మద్యం దుకాణాల పరిసర ప్రాంతాలలో మందుబాబులతో కిక్కిరిసిపోతుంటాయి.
చాల బార్లకు పర్మింట్ రూమ్లు ఉండడంతో, ఆయా దుకాణాల నిర్వాహకులు వాటిని పరిశుభ్రంగా ఉంచరు. దీంతో ఆ మద్యం దుకాణానికి వచ్చే మద్యం ప్రియులు ఆ పరిసరాలన్ని తమ అధీనంలో ఉన్న పర్మిట్ రూమ్లాంటివే అనే భ్రమలో ఉండిపోతారు. దీంతో ప్రధాన రోడ్లు, సర్వీస్రోడ్లు, కాలనీ రోడ్లు, గల్లీలు ఇలా ఎక్కడ పడితే అక్కడ వారు మద్యం బాటిళ్లతో దర్శనమిస్తుంటారు. ఆయా దుకాణాల పరిసర ప్రాంతాలలో ఉండే బస్స్టాప్లను సైతం మందు బాబులు వదలడం లేదు.
ప్రధానంగా నగర శివారు ప్రాంతాలలో ఈ పరిస్థితి ఇంకా విచ్చలవిడిగా ఉంటుంది. నగరంలోను కొన్ని ప్రాంతాలలో మద్యం దుకాణాల వద్ద ఉండే రద్దీ ప్రభావం రోడ్లపైకి వస్తుంది. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని చాల ప్రాంతాలలో మద్యం దుకాణాల వద్ద ఇలాంటి పరిస్థితి ఉన్నా రాత్రి 11 గంటల వరకు కూడా స్థానిక పోలీసులు అటువైపు వెళ్లి కనీసం పెట్రోలింగ్ కూడా చేయని పరిస్థితి కొన్నిసార్లు ఉందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్లపై ఉండే మద్యం దుకాణం పరిసరాలలోని రోడ్లన్ని మందుబాబులు, వారి వాహనాలతో నిండిపోయి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నా స్థానిక పోలీసులు అక్కడ పెట్రోలింగ్ చేస్తే చేస్తారు.. లేదంటే అటూ వైపు కూడా కన్నెత్తి చూడరు. పోలీసులు ఎక్కువగా అటు వైపు వస్తున్నారంటే వచ్చే గిరాకీపై ప్రభావం పడుతుందని కొంత మంది మద్యం దుకాణాల యజామాన్యాలు స్థానిక పోలీసులకు నెలవారీగా మాముళ్లు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి.
దీంతో రాత్రి 11 గంటల వరకు ఆయా మద్యం దుకాణాల వద్ద ఎదైనా గొడవ జరిగితేనే వెళ్లాలని, రద్దీ విషయం ఎవరైనా ఫిర్యాదు చేసినా అంతగా పట్టించుకోకుండా తేలికగా తీసుకుంటారనే విమర్శలు విన్పిస్తున్నాయి. రాత్రి 11 గంటల తరువాతనే అటు వైపు పెట్రోలింగ్ వాహనాలు వస్తుంటాయని స్తానికులు చెబుతున్నారు. రోడ్లపై మద్యం సేవిస్తూ సామాన్యులను, మహిళలను ఇబ్బందులకు గురిచేసే మద్యం బాబులు, వారిని ప్రోత్సహించే మద్యం దుకాణదారులపై చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహారించే పోలీసులపై సైతం ఉన్నతాధికారులు నిఘా పెట్టాలని సామాన్య ప్రజలు
కోరుతున్నారు.
జీడిమెట్ల, మియాపూర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, శంషాబాద్, బాలాపూర్, హయత్నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్ ఇలా నగరం చుట్టూ ఉన్న ప్రాంతాలలో ఈ పరిస్థితి నెలకొంది. నగరంలో మద్యం దుకాణాల పరిసరాలలో కార్లతో కిక్కిరిసిపోతుంటాయి. ఇలా మద్యం దుకాణం పరిసరాలలో మందుబాబులతో నిండిపోవడంతో అటువైపు నుంచి రాకపోకలు సాగించే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థాని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారులలో ఉండే మద్యం దుకాణాల పరిసరాల నుంచే కాలనీలలోకి వెళ్లే రూట్లు ఉంటాయి.
దీంతో చాల వరకు కాలనీలలోకి వెళ్లే వారు మద్యం దుకాణాల పరిసరాల నుంచి రాకపోకలు సాగించాల్సి ఉండడంతో మందుబాబుల మద్యలో నుంచే వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నదంటూ సామాన్య ప్రజలు వాపోతున్నారు. కొన్ని చోట్ల మద్యం దుకాణాల పరిసరాలలో ఉండే బస్స్టాప్లను సైతం మద్యం బాబులు తమ అధీనంలోకి తీసుకొని అక్కడ సిటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. మద్యం దుకాణాలకు ప్రభుత్వం పర్మిట్ రూమ్లను ఇచ్చినప్పుడు రోడ్డుపై మద్యం తాగే వారిని దుకాణదారులే హెచ్చరించాలి. కానీ తమ వద్దకు వచ్చే కస్టమర్లకు ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వడంతో గిరాకీ ఎక్కువగా ఉంటుందనే ఆయా దుకాణదారులు చూసీచూడనట్టు ఉంటున్నారు.