Hyderabad Metro | సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ): రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా మెట్రో సర్వీసులను పెంచేందుకు మాత్రం ఎల్అండ్టీ ససేమిరా అంటున్నది. అందుబాటులో ఉన్న మెట్రో కోచ్‌లతోనే నెట్టుకు వస్తున్నది తప్ప, కొత్త కోచ్‌లను తీసుకువచ్చేందుకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా మెట్రో రైళ్లలో బాగా రద్దీ పెరిగిపోతున్నది. ఉదయం ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల మధ్య మియాపూర్ నుంచి ఎల్బీనగర్ మార్గంలో, రాయదుర్గం నుంచి అమీర్‌పేట మార్గంలో మెట్రో రైళ్లలో నిల్చునేందుకు కూడా స్థలం ఉండడం లేదని మెట్రో ప్రయాణికులు వాపోతున్నారు. ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే మెట్రో రైళ్ల సంఖ్యను రద్దీకి అనుగుణంగా పెంచాలని నగరవాసులు సూచిస్తున్నారు. ప్రధానంగా రాయదుర్గం నుంచి అమీర్‌పేట వరకు ఉన్న మార్గంలో ప్రతి 3 నిమిషాలకు ఒక రైలును నడుపుతామని మెట్రో అధికారులు చెప్పినా, మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీ మాత్రం అందుకు అనుగుణంగా ఉండడం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా మెట్రో అధికారులు రద్దీ సమయాల్లో నిర్దేశిత మార్గాల్లో అదనపు రైళ్లను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
మరోవైపు.. రద్దీ సమయాల్లో మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌లు ప్రమాదకరంగా మారాయి. రద్దీ అధికంగా ఉండే పలు మెట్రో స్టేషన్లలో ప్రయాణికులు రైలు ఎక్కే సమయంలో ప్లాట్‌ఫాం వద్ద నిర్ణయించిన ట్రాక్ లైన్ దాటి ముందుకు వెళ్లి నిలబడుతున్నారు. పెరిగిపోతున్న రద్దీతో మార్కింగ్‌కు లైన్‌కు అవతల ప్రతి నిమిషానికి జనం పెరిగిపోతూ ఉండడంతో సిబ్బంది నియంత్రించలేకపోతున్నారు. మెట్రో రైలు వచ్చే సమయంలో ప్రయాణికులందరూ ఒకేసారి డోర్‌వైపు కదులుతుండడంతో తోపులాటి జరిగి ప్రమాద వశాత్తూ ట్రాక్‌పైన పడిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.