బేగంపేట్ జులై 14: భక్తుల పూజలు తృప్తినిచ్చాయి కాని నా కోరిక మీరు వెరవేర్చడం లేదు. నేను చెబుతూనే ఉన్నా కానీ మీరు పట్టించుకోవడం లేదు.. నాకు రక్తం బలి కావాలి.. అయినా మీరు ఎవరు నా మాట వినడం లేదు.. ‘రక్తం బలి ఇవ్వకపోతే మీరు రక్తం కక్కుకునేలా చేసా’్త అంటూ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ అమ్మవారు హెచ్చరించిన మాటలు. లష్కర్లో బోనాల ఉత్సవాలు రెండోరోజు అత్యంత వైభవంగా జరిగాయి.
సోమవారం ఉజ్జయిని మహంకాళీ అమ్మవారికి పాక సమర్పణ భవిష్యవాణి, బలిగంప, పోతరాజుల విన్యాసాలు, అంబారిపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలు కనులపండువగా నిర్వహించారు. ఉదయం మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ మహంకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 3.30గంటలకు మాతంగి స్వర్ణలత (అవివాహిత) భవిష్యవాణి వినిపించారు. పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. తొట్టెల, పలహారపు బండ్ల ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.