సిటీబ్యూరో, జనవరి 27 (నమస్తే తెలంగాణ): కమిషనరేట్ల పునర్విభజన పోలీస్ శాఖకు తలనొప్పిగా మారింది. ఇప్పటికే బల్దియా డీ లిమిటేషన్ సరిగ్గా లేదంటూ అన్ని వర్గాలు గగ్గొలు పెడుతుండా, పట్టించుకోని ప్రభుత్వం.. పోలీస్ కమిషనరేట్లను సైతం అదే ప్రాతిపదికన విభజించడం విమర్శలకు తావిస్తున్నది. ముఖ్యంగా సికింద్రాబాద్‌లోని సగ భాగాన్ని మల్కాజిగిరిలో.. ప్యూచర్ సిటీలోని కొన్ని ప్రాంతాలను విభజించి.. కలపడం అంశంలో ప్రణాళిక లోపం ఉందని పలువురు మండిపడుతున్నారు. సర్కారు ఉన్నతాధికారుల నుంచి పూర్తిస్థాయిలో అభిప్రాయాలు తీసుకోకుండానే పోలీస్ కమిషనరేట్లను విభజన ప్రక్రియ చేపట్టిందని విమర్శిస్తున్నారు.
పోలీస్ కమిషనరేట్ల, జీహెచ్ఎంసీ పునర్విభజన సరిగ్గా లేదంటూ ప్రతి పక్ష పార్టీలు, మేదావులు, కొందరు ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసు కమిషనరేట్లలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? అనే చర్చ నాలుగు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో మొదలైంది. పోలీస్ కమిషనరేట్ల విభజన, జీహెచ్ఎంసీని ప్రామాణికంగా తీసుకొని విభజించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నాలుగు పోలీస్ కమిషనరేట్లకు సంబంధించిన సిబ్బంది పంపకం, ఇతరాత్రా సౌకర్యాలపై పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటైంది. ఔటర్ లోపల ఉన్న ప్రాంతాలు శంషాబాద్, రాజేంద్రనగర్, ఆదిభట్ల, బాలాపూర్ హైదరాబాద్‌లో కలపడం, సికింద్రాబాద్‌లోని సగం భాగాన్ని మల్కాజిగిరిలో కలపడం, ప్యూచర్ సిటీలోని కొన్ని ప్రాంతాలను విభజించడం, కలపడం విషయంలో ప్రభుత్వం ప్రణాళిక లేకుండా వ్యవహరించిందనే విమర్శలు వస్తున్నాయి. పోలీస్ కమిషనరేట్ల పునర్విభజనకు సంబంధించి క్షేత్ర స్థాయి పరిశీలన జరపకుండా, ఉన్నతాధికారుల నుంచి అభిప్రాయాలు తీసుకోకుండానే జీహెచ్ఎంసీ ప్రాతిపాదికన పోలీస్ కమిషనరేట్లను విభజించిందన్న విమర్శలు ఉన్నాయి.
రాజకీయ పార్టీల నుంచి వస్తున్న వ్యతిరేకత, ప్రజల నుంచి వస్తున్న విన్నపాలు, పోలీసు అధికారులు, సిబ్బంది అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని నాలుగు కమిషనరేట్లలో చిన్న చిన్న మార్పులు చేస్తారమోననే ఆశలో సిబ్బంది ఉన్నారు. ప్రధానంగా రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ వేర్వేరు జోనల్స్ పరిధిలోకి వస్తుండడంతో అక్కడుంటే సిబ్బంది బదిలీలు, కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది బదిలీలలో ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయి. కిందిస్థాయి సిబ్బంది కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉన్నతాధికారులు ఇచ్చే నివేదికలతో మారుతుందని ఆశతో ఉన్నారు. ఇప్పటికే పునర్విభజనలో విడిపోయిన, కలిసిపోయిన కొత్త ఠాణాలు, జోన్లు, డివిజన్లు, వారి వారికి కేటాయించిన కమిషనరేట్ల పరిధిలోనే పనిచేస్తున్నాయి. సిబ్బంది బదిలీలు తప్ప..మిగతా పనులన్నీ నిర్ణయించిన కమిషనరేట్ల పరిధిలోనే కొనసాగుతున్నాయి. కొత్తగా ఏర్పడిన కమిషనరేట్లకు కేటాయించిన ఆయా పోలీస్స్టేషన్లు పరిధిలోనే సిబ్బంది విధులు నిర్వహిస్తుండడంతో హద్దులు మారుతాయనే ఆశ లేదంటూ మరికొందరు చర్చించుకొంటున్నారు. కొందరు మారుతాయని, మరికొందరు మారవంటూ మాట్లాడుకుంటుండడం పోలీస్ కమిషనరేట్ల పరిధిలో హాట్ టాపిక్‌గా మారింది.