సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ ) : మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) ఇంజినీరింగ్ విభాగంలో ఎవరికి నచ్చినట్లు వారు వ్యవహరిస్తున్నారన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఎస్ఈ చిన్నారెడ్డి ఏసీబీకి రెడ్‌హ్యాండెట్‌గా పట్టుపడడం, గతంలో వివిధ క్యాడర్లో ఉన్న పలువురు ఇంజినీర్లు కాంట్రాక్టర్ల పనుల అప్పగింత, బిల్లుల చెల్లింపుల చేతివాటంతో ఏసీబీకి చిక్కిన దాఖలాలు ఉన్నాయి. ఒకవైపు ఏసీబీ దాడులు జరుగుతున్న ఉన్న డోంట్ కేర్ అంటూ రూ. కోట్ల పనుల అప్పగింతలో అక్రమాలకు తెరలేపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఎంఎంసీ పరిధిలోని కీసర సర్కిల్లోని చెరువులు దమ్మాయిగూడ, భవానీనగర్ కుంట, చెన్నాపూర్ లేక్, హకీంపేట లేక్, బాబాగూడ చెరువుల్లో గుర్రపు డెక్క తొలగింపునకు రూ. 1.12 కోట్ల టెండర్ ప్రక్రియ వివాదస్పదానికి దారి తీసింది. షార్ట్ టెండర్ పిలవడమే కాకుండా ఏకపక్షంగా అస్మదీయులకే పనులు కట్టబెట్టారన్న ఆరోపణలు, ఫిర్యాదులు రావడం గమనార్హం. నిబంధనలను తుంగలో తొక్కి ..పారదర్శకతకు పాతరేసి తమకు కావాల్సిన వారికి పనులు కట్టబెట్టడంలో అధికారులు చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం పోటీ లేకుండానే, సింగిల్ టెండర్‌కే పనులు అప్పగించారంటూ కొందరు కాంట్రాక్టర్లు కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధం కావడం గమనార్హం.
టెండర్ నిబంధనలు ఉల్లంఘన..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్ ప్రక్రియలో కనీసం ముగ్గురు పాల్గొనాలి. ఒకే టెండర్ (సింగిల్ టెండర్) వచ్చినప్పుడు పనులను కేటాయించకుండా రీ టెండర్ పిలవాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. నిబంధనలన్నీ తెలిసినా, ఇంజినీరింగ్ అధికారులు మొండిగా ముందుకు వెళ్లారు. ఒకే ఒక్క కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించడంపై తోటి కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన వారిని పక్కన పెట్టి సింగిల్ టెండర్‌కు ఎలా అప్పగిస్తారని అంటూ అధికారులను బాధితులు నిలదీస్తున్న పరిస్థితి. నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి, టెండర్లో ఒకే ఒక్కరు పాల్గొన్న కాంట్రాక్టరుకు పనులు కట్టబెట్టడం చర్చనీయాంశంగా మారింది. పనులు దకించుకున్న సంస్థతో అధికారులకు ఉన్న లోపాయికారి ఒప్పందం వల్లే ఇలా జరిగిందని బాధిత కాంట్రాక్టర్లు నిలదీస్తున్నారు.
అధికారుల మౌనంపై అనుమానాలు..!
ఈ వ్యవహారంపై వివరణ కోరేందుకు వెళ్లిన బాధితులకు అధికారుల నుంచి చేదు అనుభవమే ఎదురవుతోంది. టెండర్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై నోరు విప్పేందుకు ఉన్నతాధికారులు ససేమిరా అంటున్నారు. వివరాలు అడిగితే దాటవేస్తూ గోప్యత పాటిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కిందిస్థాయి ఇంజినీర్ల నుంచి పైస్థాయి అధికారుల వరకు అందరూ కుమ్మకై ఈ అవినీతి పర్వానికి తెరలేపారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత పెంచేందుకు తీసుకొచ్చిన సమాచార హకు చట్టాన్ని (ఆర్టీఐ)ని ఎంఎంసీ అధికారులు అపహాస్యం చేస్తున్నారని బాధిత కాంట్రాక్టర్లు పేర్కొన్నారు.
అడ్వకేట్ హరీశ్ ఆర్టీఐ ద్వారా టెండర్ నోటిఫికేషన్ కాపీలు, ప్రాజెక్టు అంచనాలు, టెండర్ వేసిన బిడ్డర్ల జాబితా, ఎంపికైన వారి అర్హతలు వంటి కీలకమైన 7 రకాల అంశాలపై సర్టిఫైడ్ కాపీలు కావాలని ఆయన కోరారు. ఈ వివరాలు అడిగితే ఇంటికి పంపాల్సిన నిబంధనలను తుంగలో తొకి, ‘కార్యాలయానికి వచ్చి చూసుకో’ అంటూ హుకుం జారీ చేస్తున్నారని చెబుతున్నారు. లిఖిత పూర్వకంగా కాపీలు ఇవ్వకుండా కేవలం చూసి వెళ్లమని చెప్పడం వెనుక ఉన్న అంతర్యమేమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. వివరాలు బయటకు వస్తే ఎకడ తమ అక్రమాలు వెలుగు చూస్తాయోనన్న భయంతోనే అధికారులు ఇలా కాలయాపన చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.