Crime Rate | సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో భారీగా నేరాలు పెరిగాయి. దోపిడీలు, దొంగతనాలు, కిడ్నాప్, దాడులు ఇలా అన్ని రకాల నేరాలు పెరుగుతూ వెళ్లాయి. గతేడాది డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత హైదరాబాద్‌లో శాంతి భద్రతలు అదుపు తప్పాయి.నేరాల సంఖ్య పెరుగుతూ వెళ్లింది.. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆదివారం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ విడుదల చేసిన వార్షిక నివేదిక(2024)లో పలు అంశాలు ఇవీ.. నగర వ్యాప్తంగా ఈ ఏడాది 35,944 కేసులు నమోదయ్యాయి. అదే 2023లో ఈ సంఖ్య 25,488గా ఉండగా, ఇది 41 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. ఇందులో ఆస్తులకు సంబంధించిన కేసులు గతేడాది 3,198 నమోదు కాగా, ఈ ఏడాది 5,328 నమోదయ్యాయి.
అంటే దొంగతనాలకు సంబంధించిన కేసుల్లో 66 శాతం పెరిగాయని నివేదిక వెల్లడించింది. గత ఏడాది 67 శాతం కేసుల ఛేదన ఉండగా, ఈ ఏడాది 59 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికలు, అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నగర పోలీస్ విభాగంలో భారీగా బదిలీలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల నిబంధనల మేరకు హైదరాబాద్‌లో పనిచేసిన వాళ్లు ఇతర జిల్లాలు, కమిషనరేట్లకు, అక్కడ పనిచేసిన వాళ్లు హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. దీంతో జిల్లాలు, ఇతర కమిషనరేట్ల నుంచి వచ్చిన అధికారులకు హైదరాబాద్ పోలీసింగ్‌కు సంబంధించి పూర్తి అవగాహన లేకపోవడంతోనే నేరాలు పెరిగాయని అధికారులు పేర్కొంటున్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పటిష్టంగా ఉండాలని, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి సిటీ పోలీసింగ్‌పై అవగాహన సరిగా లేకపోవడంతో మొదట్లో కొంత తడబడ్డారన్నారు.
ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 88.89 లక్షల వాహనాలున్నాయని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 48.81 లక్షల చలాన్లు వేసినట్లు చెప్పారు. సీసీఎస్‌లో గతేడాది 361 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 248 కేసులు నమోదయ్యాయన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రకటనలు చూసి ప్రీలాంచ్ ఆఫ్లర్లకు ఆకర్షితులై డబ్బు చెల్లించారని, అలాంటి కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా జరుగుతున్నదన్నారు. మోసం చేసిన వారి ఆస్తులను గుర్తించి అటాచ్ చేస్తున్నామని, కోర్టు ఆదేశాలతో ఆ ఆస్తులను వేలం వేస్తామన్నారు. డయల్ 100కు ఫోన్ చేస్తే 7 నిమిషాల్లోపే పోలీసులు సంప్రదిస్తున్నారన్నారు. ముత్యాలమ్మ ఆలయ ఘటన తరువాత నిరాశ్రయులై రోడ్డుపై ఉండే వారికి షెల్టర్ ఇచ్చేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. సైబర్ నేరాల్లో సుమారు రూ. 297 కోట్లు ప్రజలు నష్టపోయారన్నారు. ఈ ఏడాది గుజరాత్, రాజస్థాన్, సౌత్ ఇండియా మాడ్యుల్స్కు చెందిన వారిని భారీ స్థాయిలో అరెస్టు చేశామన్నారు. బ్యాంకింగ్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడంతో సైబర్ నేరస్తులు కరెంట్ అకౌంట్స్ ఈజీగా సంపాదిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే యాక్సిస్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్, ఆర్బీఎల్ బ్యాంకు డిప్యూటీ మేనేజర్లను అరెస్టు చేశామన్నారు. మాదక ద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు రోప్‌ను వచ్చే ఏడాది మరింత పటిష్టగా అమలు చేస్తామని సీపీ ఆనంద్ వెల్లడించారు. ఇందుకు టౌన్ వెండింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తామని, ట్రై పోలీస్ కమిషనరేట్లను సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పనిచేస్తామన్నారు. ట్రాఫిక్ విభాగం ప్రజలతో నిరంతరం ముడిపడి ఉంటుందని, ట్రాఫిక్ సాఫీగా వెళ్తే పోలీసులు బాగా చేస్తున్నారని ప్రజలు అనుకుంటారని, ట్రాఫిక్ సాఫీగా వెళ్లకపోతే ప్రజలు పోలీసుల పనితీరుపై విమర్శస్తారని, అందుకే ట్రాఫిక్‌పై ప్రధాన దృష్టి సారిస్తామన్నారు. సీసీ కెమెరాలపై స్పెషల్ ఫోకస్ పెడుతామని, పాడైన కెమెరాలను బాగుచేయడం, మరిన్ని కెమెరాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సీపీ స్పందిస్తూ..బౌన్సర్ల ప్రవర్తన సరిగ్గా ఉండడం లేదని ఆయా ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా బౌన్సర్ పోలీసులను టచ్ చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. వీఐపీలు, వీవీఐపీలు తమ కార్యక్రమాలు నిర్వహించుకునే సమయంలో బౌన్సర్లకు, అక్కడి పరిస్థితులకు సంబంధించిన బాధ్యత వాళ్లదే ఉంటుందన్నారు. బౌన్సర్లు అతిగా చేస్తే..చర్యలు తీసుకుంటామన్నారు.