Hyderabad | సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): మినీ ఇండియాగా పేరుగాంచిన మహానగరంలో శాంతిభద్రతలు గాడి తప్పుతున్నాయా….హైదరాబాద్ నగరం మరో బిహార్‌గా మారుతున్నదా..? ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు చేస్తుంటే.. అవుననే అనిపిస్తున్నది. పట్టపగలే నడి రోడ్లపై జరుగుతున్న వరుస హత్యలు ప్రజల గుండెల్లో దడపుట్టిస్తున్నాయి. పట్టపగలే రోడ్లపై జరుగుతున్న దోపిడీలు, రాత్రి సమయాల్లో ఇండ్లపై విరుచుకుపడుతున్న దొంగల ముఠాలతో ప్రజల ఆస్తులకూ భద్రత కరువైంది. పోలీసు శాఖ గాడి తప్పడానికి ప్రధాన కారణం పోస్టింగ్‌ల్లో పెద్ద ఎత్తున పైరవీలే అని సొంత శాఖలోనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులు పెట్టి..పోస్టింగ్‌లు పొందిన కొందరు అధికారులు విధి నిర్వహణపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ట్రై కమిషనరేట్ల పరిధిలో ఈ మధ్య జరుగుతున్న హత్యలు, ప్రతీకార దాడులకు కొందరు పోలీసు అధికారుల నిర్లక్ష్యం, ఏకపక్ష నిర్ణయాలే ప్రధాన కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై సంబంధిత ఠాణా అధికారులు స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం లేదా ప్రత్యర్థి వర్గానికి కొమ్ముకాసి బాధితులకు అన్యాయం చేయడంతో చిన్నపాటి గొడవలు సైతం ప్రతీకార దాడులు, హత్యలకు దారి తీస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
గతంలో రోడ్లపై విజిబుల్ పోలీసింగ్ కనిపించేది. తరచూ పోలీసు గస్తీ తిరిగేది. ప్రస్తుతం గస్తీకి సుస్తీ పట్టింది. ఒకప్పుడు సీసీ కెమెరాలు లేని సమయంలో పోలీసు గస్తీ ముమ్మరంగా ఉండి నేరాల నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణ సుస్థిరంగా ఉండేది. ఇప్పుడు అడుగడుగునా సీసీ కెమెరాలున్నా.. దారుణాలు జరుగుతున్నాయి. బస్తీలు, కాలనీలు, ప్రధాన రహదారులపై గస్తీ లేకపోవడంతో రోడ్లపై దుండగులు కత్తలతో స్వైరవిహారం చేస్తున్నారు. దారిదోపిడీలూ పెరిగిపోతున్నాయి.
ట్రై కమిషనరేట్ పరిధిలో డయల్ 100 ప్రచార ఆర్భాటాలకే పరిమితమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు బాధితులు ఫోన్ చేసిన అరగంట తరువాత పోలీసులు ఘటనా స్థలికి చేరుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ మధ్య కాలంలో తరచూ జరుగుతున్న బదిలీలు కూడా శాంతి భద్రతలు విఫలమయ్యేందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక అధికారి తాను పనిచేస్తున్న ఏరియాపై పట్టు సాధించాలంటే కనీసం సంవత్సరకాలమైనా పనిచేయాలి. కానీ గడిచిన ఆరునెలల కాలంలో ఏ అధికారి ఎప్పుడు బదిలీ అవుతాడో తెలియక అయోమయ పరిస్థితి నెలకొన్నది. చాలా మంది అధికారులు పోస్టింగ్ తీసుకున్న నెల, రెండు నెలల్లోనే మరోచోటకు బదిలీ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి.