చిక్కడపల్లి, ఏప్రిల్ 2: హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం అప్పజెప్పే ప్రయత్నాలను చేస్తుందని సీపీఎం పార్టీ నాయకులు మండిపడ్డారు. ఆ భూములు తిరిగి హెచ్సీయూకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. హెచ్‌సీయూ వద్ద నిరసన తెలిపిన సీపీఎం రాష్ట్ర నాయకుల అరెస్ట్‌లను నిరసిస్తూ బుధవారం సీపీఎం పార్టీ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములను అమ్మటం ద్వారా ఆర్థిక వ్యవస్థను నడపాలని భావించడం తీవ్ర అభ్యంతరకరమన్నారు. వెంటనే అలాంటి ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు జె. వెంకటేష్ మాట్లాడుతూ హెచ్.సి.యు భూములను కాపాడుకునేందుకు స్థానిక విద్యార్థి సంఘం వీరోచితంగా పోరాడుతున్నదని, సీపీఎం పార్టీ వారి పోరాటానికి అండగా నిలుస్తుందని తెలియజేశారు. ఇప్పటికైనా తప్పును గ్రహించి సదరు భూములను యూనివర్సిటీకి అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ గ్రేటర్ హైదరాబాద్ సెంటర్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం. వెంకటేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్. అరుణ జ్యోతి, ఎం. శ్రీనివాసరావు, ఎం.మహేందర్, కే.ఎన్ రాజన్న, ఆర్. వెంకటేష్, జే. కుమారస్వామి, జి. కిరణ్, జి.నరేష్, అశోక్, జావేద్ తదితరులు పాల్గొన్నారు.