Metro Rail | సిటీబ్యూరో, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ): ‘మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. కనీసం నిలబడటానికి చోటు ఉండటం లేదు. కదలడానికి… మెదలడానికి అవకాశం ఉండటం లేదు. మెట్రో కోచ్‌లు పెంచండి.. 3 కోచ్‌లు ఉన్న మెట్రో రైలును ఆరు కోచ్‌ల వరకు పెంచండి’ ఇదీ గత కొన్ని నెలలుగా మెట్రో ప్రయాణికులు చేస్తున్న ప్రధాన డిమాండ్. ప్రధానంగా లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు నిత్యం మెట్రోలోనే ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణీకుల రద్దీతో మెట్రో రైళ్లలోనే కాదు.
మెట్రో స్టేషన్ ప్రాంగణాలు సైతం కిక్కిరిసిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులను డిమాండ్లను పరిష్కరించాల్సిన ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు అందుకు భిన్నంగా తుగ్లక్ నిర్ణయం తీసుకున్నారని మెట్రో ప్రయాణికులు, పార్టీలు మండిపడుతున్నాయి. మెట్రో పార్కింగ్ లాట్లో ఎనిమిది గంటల పాటు ద్వి చక్రవాహనం నిలిపితే రూ.40.00లు, కారుకు రూ.120.00లుగా నిర్ణయించారు.
మెట్రో పార్కింగ్ స్థలంలో వాహనాలను పార్కింగ్ చేసిన ఐటీ ఉద్యోగులు రాయదుర్గంలో ఉద్యోగం చేసి తిరిగి మెట్రోలో వస్తే సుమారు తొమ్మిది గంటల సమయం పడుతుంది. దీంతో ఈ లెక్కన ప్రతి రోజు లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు వాహనాల పార్కింగ్ ఫీజుల కోసమే వేలాది రూపాయలను వెచ్చించాల్సి వస్తోందంటూ మెట్రో అధికారులపై తిరగబడ్డారు. రద్దీ పెరగడంతో మెట్రో కోచ్‌లను పెంచాలని అడుగుతుంటే.. అకస్మాత్తుగా పార్కింగ్ చార్జీలను భారీగా పెంచడం ఏమిటంటూ ప్రయాణికులంతా ఒక్కటై మెట్రో స్టేషన్లో ఆందోళనకు దిగారు.
మరోవైపు సీపీఎం నాయకులు సైతం ప్రయాణికులకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఆగస్టు 25 నుంచి అమలు చేస్తామని చెబుతున్న పార్కింగ్ ఫీజుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ ప్రయాణికులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన వందలాది ఎకరాల భూములను తమ ఆదాయం కోసం చూస్తున్నారే తప్ప, ప్రయాణికుల అవసరాలను, ఇబ్బందులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదంటూ
మండిపడుతున్నారు.
నగరంలో ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థగా అందుబాటులోకి వచ్చిన మెట్రో రైలులో ప్రయాణికుల అవసరాలను అధికారులు గుర్తించడం లేదంటూ సీపీఎం నాయకులు శనివారం బేగంపేటలోని మెట్రో రైలు భవన్ ముందు ధర్నా చేపట్టారు. సీపీఎం నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్ నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మెట్రో భవన్ ముందు ఆందోళన చేపట్టారు. రద్దీ పెరగడంతో మెట్రో ప్రయాణికులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మెట్రో కోచ్‌లను మూడు నుంచి ఆరుకు పెంచాలని నినాదాలు చేశారు. ధర్నా అనంతరం, హైదరాబాద్ మెట్రో రైలు ఎమ్డీ ఎన్వీఎస్ రెడ్డికి మెట్రో ప్రయాణికుల డిమాండ్లు, ఎదురవుతున్న ఇబ్బందులపై సీపీఎం నాయకుడు వినతి పత్రాన్ని అందజేశారు.
– బేగంపేటలోని మెట్రో భవన్ వద్ద సీపీఎం నాయకుల ధర్నా
నగరంలో మెట్రో రైలు సేవలను అందిస్తున్న ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థకు ఆదా యం, లాభాలు తప్ప ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కొన్ని స్టేషన్లలో ఇప్పటి వరకు ఉచితంగా ఉన్న పార్కింగ్ స్థలాలకు భారీగా చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించారు. పార్కింగ్ చార్జీలను రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా రైలు లోపల నిలబడలేని పరిస్థితి ఏర్పడుతున్నది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మూడు కోచ్‌లను ఆరు కోచ్‌లుగా పెంచుతామని మెట్రో అధికారులు గతంలో ప్రకటించినప్పటికీ, నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కోచ్‌ల సంఖ్య సంఖ్య పెంచాలని మెట్రో ప్రయాణికులంతా ముక్త కంఠంతో డిమాండు చేస్తున్నప్పటికీ ఎల్ అండ్ టీ యాజమాన్యం సరిగా స్పందించడం లేదు.
– ఎం.శ్రీనివాస్, సీపీఎం నగర కార్యదర్శి