ఇబ్రహీంపట్నం, మార్చి 3 : రామోజీ ఫిలిం సిటీలో పేదలకు కేటాయించిన ఇండ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పోరాటం ఆగదని సీపీఎం జిల్లా నాయకులు పి. జగన్ అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం ముకనూరు గ్రామంలో సోమవారం రామోజీ ఫిలింసిటి ఇంటి స్థలాల పోరాట కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పి.జగన్ మాట్లాడుతూ.. గత 17 సంవత్సరాలుగా ఇంటి స్థలాల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఇంకా ప్రజల ఓపికను పరీక్షించాలనుకుంటే అధికారులకు, ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 670మంది పేదలకు ఇంటి స్థలాలను కేటాయించి ఇల్లు కట్టుకోవటానికి ప్రొసిడింగ్స్ కూడా ఇచ్చారని.. ఆయన మరణం తర్వాత ఇంటి పట్టాలను అధికారులు తిరిగి తీసుకున్నారని గుర్తుచేశారు. ఇంటి స్థలాలను రామోజీ యాజమాన్యం కబ్జా చేసినా పట్టించుకోకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. అధికారులు, ప్రభుత్వం రామోజీ యాజమాన్యానికి లొంగిపోయారని అన్నారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తే సహించేది లేదని వెంటనే లబ్ధిదారులకు కేటాయించిన స్థలాలను ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం ఐదులక్షల రూపాయలను ఇవ్వాలని, లేని పక్షంలో త్వరలోనే లబ్ధిదారులకు ఇచ్చిన ఇంటి స్థలాలను సీపీఎం నాయకత్వంలో స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పది మంది సభ్యులతో కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులుగా కృష్ణ, సువర్ణ, సంతోష, సత్యమ్మ, పద్మ, యాదమ్మ, ఇందిరమ్మ, హబీబా, స్వరూపా, అండాలు తదితరులున్నారు.