సిటీబ్యూరో, నవంబర్ 22(నమస్తే తెలంగాణ) : సైబర్ నేరాల విషయంలో అప్రమత్తత అవసరమని, ప్రజల భయం, అత్యాశే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతున్నదని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. శనివారం చార్మినార్ ప్రాంగణంలో సిటీ పోలీసులు నిర్వహించిన ‘జాగృత్ హైదరాబాద్-సురక్షిత్ హైదరాబాద్’ సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమానికి సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ అధికారులతో కలిసి ఆయన చార్మినార్ పరిసరాల్లో సైబర్ క్రైమ్ నివారణ కరపత్రాలను పంపిణీ చేశారు.
ఆ తర్వాత చార్మినార్ నుంచి మదీనా వరకు సైబర్‌క్రైమ్ అవగాహన ర్యాలీ నిర్వహించి సైబర్ ప్రతిజ్ఞ చేయించారు. హైదరాబాద్‌ను సైబర్ నేరరహితంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రతి మంగళ, శనివారాల్లో ‘జాగృత్ హైదరాబాద్- సురక్షిత్ హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సజ్జనార్ అన్నారు. అవగాహన లేమితోనే అనేకమంది సైబర్‌నేరాల బాధితులవుతున్నారని, ఏ రకమైన సైబర్ మోసం అయినా, వాటికి అడ్డుకట్ట వేయాలంటే ప్రజలకు స్వీయ అవగాహన కలిగి ఉండాలన్నారు. సైబర్ నేరాల నివారణకు ప్రజలను భాగస్వాములను చేస్తున్నామని, స్వచ్ఛందంగా వలంటీర్లుగా ముందుకు వచ్చేవారు సైబర్ సింబాలుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఇంట్లో ఒక సైబర్ సింబా తయారై తన కుటుంబాన్ని, సమాజాన్ని సైబర్ మోసాల నుంచి రక్షించాలని సీపీ పిలుపునిచ్చారు.
ప్రైవేటు ఫొటోలు, వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయవద్దని, అలా చేస్తే సైబర్ నేరగాళ్లు ట్రాప్‌చేసి మోసం చేసే అవకాశం ఉంటుందని హెచ్చరిం చారు. పిల్లలు సోషల్‌మీడియాకు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారని, ముఖ్యంగా ఆడపిల్లలు అజ్ఞాత వ్యక్తులతో చాటింగ్‌చేసి వ్యక్తిగత వివరాలు ఇచ్చి బాధితులు అవుతున్నారని చెప్పారు. సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుంటున్న డిజిటల్ అరెస్ట్ మోసాల పట్ల వారి పిల్లలు అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ తెలిపారు. సైబర్ మోసాల్లో గోల్డెన్ అవర్ కీలకమని, మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే పోగొట్టుకు న్న డబ్బు వచ్చే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ క్రైమ్స్ అండ్ సిట్ శ్రీనివాస్, సౌత్ జోన్ అడిషనల్ డీసీపీ మాజిద్, ఏసీపీలు చంద్రశేఖర్, సీహెచ్ చంద్రశేఖర్, జి.శ్యామ్‌సుందర్, ఎంఏ జావిద్, తదితరులు పాల్గొన్నారు.