సిటీబ్యూరో, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సీపీగా మళ్లీ వస్తానని అనుకోలేదని, ఆ గణనాథుడి అనుగ్రహంతోనే తిరిగి హైదరాబాద్ సీపీగా వచ్చానని.. గణేశ్ చతుర్థి రోజు హైదరాబాద్ సీపీగా నియామకం జరగడం సంతోషగా ఉందని సీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు. మంగళవారం గణేశ్, మిలాద్ ఉన్ నబీ పండుగులకు సంబంధించిన బందోబస్తుపై సెంట్రల్ జోన్, సౌత్‌జోన్ పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు ఆయన ఖైరతాబాద్‌లోని బడా గణేశుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను సెంట్రల్ జోన్ డీసీపీగా ఉన్నప్పటి నుంచి గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు సుదర్శన్, పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ప్రశాంత వాతావరణంలో పడుగ పూర్తి చేశారని తెలిపారు. ఖైరతాబాద్ గణేశ్ వద్ద ఇబ్బందులు లేకుండా రద్దీని బట్టి పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. ప్రధాన అంశం 70 అడుగుల గణేశ్ నిమజ్జనం అని, అందులో ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం చూడటానికి లక్షలాది మంది తరలి వస్తారని చెప్పారు. గత సంవత్సరం లాగానే మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయ్యేలా చూడాలని నిర్వాహకులను కోరారు.
ఒక భక్తునిగా, ఒక హైదరాబాదీగా ఇక్కడకు నన్ను ఆ వినాయకుడే రప్పించాడని సీపీ పేర్కొన్నారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ పోలీసులు నిమజ్జనం రోజు సుమారు 40 గంటల వరకు బందోబస్తులో ఉండాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. నగరంలో కీలకమైన జోన్లు సెంట్రల్ జోన్, సౌత్‌జోన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల అధికారులతో బందోబస్తు గూర్చి చర్చించారు. గణేశ్, మిలాద్ ఉన్ నబీ పండుగలకు బందోబస్తు ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఆయా డీసీపీలు ఇతర అధికారులకు సీపీ దిశా నిర్దేశం చేశారు.