సిటీబ్యూరో, సెప్టెంబర్ 28(నమస్తే తెలంగాణ) : మనిషిలో ఉండే రెండు బలహీనతలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. ఇసాకా హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘సెక్యూరింగ్ ది ఫ్యూచర్ నావిగేటింగ్ ద ఇంటరాక్షన్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ, ప్రైవసీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్’ పేరుతో వెస్టిన్ హైదరాబాద్లో ప్రత్యేక సదస్సును బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భయం, దురాశతోనే సైబర్ నేరాలు జరుగుతున్నాయని, ఇప్పటివరకు జరిగిన నేరాల్లో 30శాతం వాటా సైబర్ క్రైమ్ ఆక్రమించిందని, రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
ఆన్లైన్ బెట్టింగ్, రుణ యాప్ల మోసాలు విపరీతంగా పెరిగాయన్నారు. యూపీఐ చెల్లింపులు, క్రిప్టో నెట్వర్క్ ఉపయోగించి పెద్ద ఎత్తున మోసాలు చేస్తున్నారని తెలిపారు. అతి తక్కువ ఐటీ మౌలిక వసతులతోనే సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, వారి వద్ద అత్యాధునిక సాంకేతికత లేదని స్పష్టం చేశారు. సైబర్ నేరాలపై అవగాహనరాహిత్యం, నిర్లక్ష్యం కారణంగానే మోసాలకు గురవుతున్నారని తెలిపారు. ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఎనిమిది బిలియన్ల సైబర్ నేరాలు జరిగాయని ఐటీ, ఎలక్ట్రానిక్స్ విభాగం డిప్యూటీ సెక్రటరీ భవేశ్ మిశ్రా అన్నారు. రికవరీ మాత్రం ఇరవై శాతంలోపే ఉందని, ఐటీ, డేటా, పోలీసు, ఆడిటర్లు మేథోమథనం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇసాకా హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ జీసీఎస్ శర్మ మాట్లాడుతూ.. సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీ, ఏఐపై చర్చించామని తెలిపారు. తమ చాప్టర్లో ఆడిటర్లు, బ్యాంకర్లు, సీఏలూ, ప్రభుత్వ ఉద్యోగులు, ఏఐ నిపుణులు, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టులు ఉన్నారని, ఇసాకా 166 దేశాల్లో 228 చాప్టర్లను కలిగి 1.8లక్షల మంది సభ్యులతో విస్తరించిందన్నారు. కార్యక్రమంలో ఇసాకా బోర్డు వీపీ దినేశ్ దాస్, సెక్రటరీ జీవీ వంశీకృష్ణ, కోశాధికారి వెంకటరామ్, మెంబర్షిప్ డైరెక్టర్ రాజ్ పవార్, అకడమిక్ రిలేషన్ డైరెక్టర్ సతీష్ బొట్టా, ప్రొగ్రాం డైరెక్టర్ రజనీశ్ దాసరి, డైరెక్టర్ షీ లీడ్స్ టెక్ షారన్ గద్దాల, సలహాదారులు శ్రీరామ్ బిరుదవోలు, డైరెక్టర్ ప్రభుత్వ సంబంధాలు ఎంవీ పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.