జీహెచ్ఎంసీ పాలకమండలికి కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 84 రోజులు మాత్రమే మిగిలి ఉంది..2020 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార గులాబీ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించింది. బంజారాహిల్స్ డివిజన్ నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్‌గా గెలిచిన గద్వాల విజయలక్ష్మి 2021 ఫిబ్రవరి 11న మేయర్‌గా , డిప్యూటీ మేయర్‌గా తార్నాక డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డిలు బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలోనే 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం.. కొన్ని నెలల వ్యవధిలోనే మేయర్, డిప్యూటీ మేయర్లు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే రానున్న 2026 ఫిబ్రవరి 10వ తేదీతో మేయర్‌తో పాటు, ఇతర కార్పొరేటర్ల పదవీ కాలం ముగియనున్నది.
సిటీబ్యూరో, నవంబరు 18 (నమస్తే తెలంగాణ) : పాలకమండలిని సమర్థవంతంగా నడిపించడంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విఫలం చెందారన్న విమర్శలు లేకపోలేదు. రెండేళ్లుగా మేయర్ తరుచూ పలు వివాదాల్లోనే కొనసాగుతుండడం గమనార్హం. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన మేయర్ అన్ని పార్టీల నేతలతో వివాదాలు తీవ్ర చర్చకు దారి తీశాయి. కౌన్సిల్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం ఇవ్వడం లేదని, అభివృద్ధి విషయంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ల ప్రతిపాదనలను పట్టించుకోవడం లేదని గులాబీ పార్టీ కార్పొరేటర్లు మేయర్ తీరును ఎండగడుతూ వచ్చారు.
ఉప్పల్ నియోజకవర్గంలో ప్రొటోకాల్ వివాదం, అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో జరిగిన గ్రేటర్ నేతల సమన్వయ సమావేశంలో మేయర్ వ్యాఖ్యలు భారీ దుమారాన్ని రేపాయి. స్టాండింగ్ కమిటీ సమావేశాల్లోనే ఎంఐఎం సభ్యులు మేయర్ వైఖరిని తప్పుపట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆజాద్(మోతీ)మార్కెట్ తనిఖీ సందర్భంలోనూ మేయర్ వర్సెస్ ఎమ్మెల్సీ భేగ్ల మధ్య వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2022లో బాగ్ అంబర్ పేటలో నాలుగేళ్ల చిన్నారిపై కుకల దాడి చేయటంతో ప్రదీప్ అనే చిన్నారి చనిపోయిన ఘటనపై కూడా మేయర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెల్సిందే. మేయర్ అధ్యక్షతలోని కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మానాల్లో ఎకువ అర్థరహితమైనవేనన్న విమర్శలుండటంతో ఈ నెల 25న నిర్వహించనున్న కౌన్సిల్ సమావేశంలో ఆమె ఎలా వ్యవహారించనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ నెల 20వ తేదీన స్టాండింగ్ కమిటీని, 25న కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రెండేళ్లలో ఎక్కడ వేసినా గొంగళి అక్కడే..
వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీతో ప్రస్తుతం ఉన్న పాలకమండలి గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీకి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా? లేదా కొంతకాలం స్పెషల్ ఆఫీసర్ పాలన వైపే అధికార పార్టీ మొగ్గు చూపుతుందన్న చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్లకు మూడు ముకలుగా జీహెచ్ఎంసీని విభిజించాలన్న విషయం తెరపైకి ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇదే జరిగితే స్పెషల్ ఆఫీసర్ పాలన అనివార్యంగా మారనున్నది. గడిచిన రెండేళ్లలో గ్రేటర్లో అభివృద్ధి, సంక్షేమం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. ముఖ్యంగా సిటీలో సరారు ఏడాది క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా శంకుస్థాపన చేసిన హెచ్ సిటీ పనులు ఇంకా గ్రౌండింగ్ కాకపోవటం, ఒక ప్రాజెక్టు కూడా పనులు ముందుకు సాగకపొవటంతో సరారు ఏడాది సమయం తీసుకుని, హెచ్ సిటీ పనులు విజుబిలిటీ స్థాయికి వచ్చిన తర్వాతే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని సరారు భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
రేపు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనుంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూంలో ఈ సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎజెండా అంశాలను అందజేశారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో కోడ్ కారణంగా స్టాండింగ్ కమిటీ సమావేశం గడిచిన రెండు నెలలుగా జరగలేదు. కోడ్ ముగియడంతో ప్రతి వారం జరగాల్సిన స్టాండింగ్ కమిటీపై కమిషనర్ కర్ణన్ దృష్టి సారించారు. ఈ సమావేశంలో 20 అంశాలపై సభ్యులు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
సనత్‌నగర్ ఇండ్రస్టియల్ ఏరియాలో రూ.2.1 కోట్లతో వరద నీటి కాలువ అభివృద్ధి, ఒవైసీ జంక్షన్ ఫ్లై ఓవర్ డౌన్ ర్యాంపు నిర్మాణంలో భాగంగా ఏడు చోట్ల ఆస్తుల స్వాధీనం,హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రసూల్ పురా జంక్షన్ నాలుగు లేన్ల రహదారి విస్తరణకు 26 చోట్ల ఆస్తుల సేకరణ, ఆర్కే పురం జంక్షన్లో 10 చోట్ల ఆస్తుల స్వాధీనం, కేపీహెచ్‌బీ కాలనీ ఫేజ్4లో రూ. 5 కోట్లతో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, రేతిబౌలి, నానల్‌నగర్ ఫ్లై ఓవర్ నిర్మాణంలో 106 చోట్ల ఆస్తుల సేకరణ అంశాలపై చర్చించి సభ్యులు ఆమోదం తెలపనున్నారు. వీటితో పాటు ఫలక్‌నుమా ఆర్వోబీ, 33 ఏండ్లకు పైబడి లీజు చెల్లించకుండా చాచా నెహ్రూపార్కులో స్పోర్ట్స్ గ్రౌండ్లో తిష్ట వేసిన సాయిబాబా అంశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. రూ.12 కోట్లలో ఫత్తేనగర్ బ్రిడ్జి పునరుద్ధరణ, ఖైరతాబాద్ జోన్లో 10 స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లకు టెండర్ల ఆహ్వానం, పర్యాటక స్థలాలైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, క్లాక్ టవర్‌లో రూ.2.7 కోట్ల పారిశుధ్య పనుల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించేందుకు సిద్ధం చేశారు.