మేడ్చల్, జూన్ 22(నమస్తే తెలంగాణ): మున్సిపాలిటీలు అవినీతి మయంగా మారుతున్నాయి. ఏసీబీ దాడులు, విజిలెన్స్‌కు ఫిర్యాదులు వెళ్తున్నా.. అవినీతి తగ్గడం లేదు. మేడ్చల్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లోపంతో మున్సిపాలిటీల అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా మారింది. టౌన్‌ప్లానింగ్ నుంచి ట్యాక్స్ వరకు ప్రతి సేవకు రేట్లు ఫిక్స్ చేసి ప్రజల వద్ద వసూళ్లు చేస్తున్నారు. అభివృద్ధి పనుల కంటే మమూళ్లపై దృష్టి సారించి ప్రజల వద్ద అధికారులు దండుకుంటున్నారు.
మేడ్చల్ జిల్లాలో నాలుగు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. శివారు ప్రాంతంలో ఉన్న మున్సిపాలిటీలకు హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంత వాసులే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి శివారు మున్సిపాలిటీల ప్రాంతాల పరిధిలో నివాసం ఏర్పర్చుకుంటున్నారు. దీంతో మేడ్చల్ జిల్లాలోని శివారు ప్రాంతాల మున్సిపాలిటీల్లో డిమాండ్ ఏర్పడింది. మున్సిపల్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల కాలంలోనే నాగారం మున్సిపాలిటీలో విధులు నిర్వహించే డీఈ రఘు కాంట్రాక్టర్ వద్ద రూ. 75 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తూంకుంట మున్సిపాలిటీలో ఇంటి మ్యుటేషన్‌కు సంబంధించి లంచం డిమాండ్ చేయగా, బీల్ కలెక్టర్‌గా విధులు నిర్వహించే రాంరెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్‌గా విధుల నిర్వహించే శ్రావణ్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీలో ఇన్చార్జి ఏఈగా విధులు నిర్వహిస్తూ రాజశేఖర్, వర్క్ ఇన్స్పెక్టర్ సన్నిలు కంట్రాక్టర్ వద్ద రూ. 30 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కారు.
అంతేకాకుండా బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, గూండ్లపోచంపల్లి, మేడ్చల్, నాగారం తదితర మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరా, మోటర్ల మరమ్మతులు, సామగ్రి కొనుగోలు పేరిట అవినీతి జరిగిందని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో బాధ్యులపై విచారణ చేస్తున్నామని చెబుతున్నా.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
మున్సిపాలిటీల్లో అత్యధికంగా టౌన్‌ప్లానింగ్ విభాగంలోనే అవినీతి జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటి నిర్మాణాలకు దరఖాస్తులు చేసుకొని అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు సమర్పించినా.. ఇంటి అనుమతుల జారీలో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వారు అడిగింది ఇస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటి అనుమతులు జారీ చేస్తున్నారు.
అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. ముడుపులు ఇస్తే అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో పాటు ఇంటి పన్ను మార్పులు, ఖాళీ స్థలాల పన్ను విధింపుల్లో అధికారులు ముడుపులు అడుగుతున్నారు. ఈ పనికి ఇంత అని ఒక ధరను ఫిక్స్ చేసి.. బ్రోకర్లను అధికారులు ఏర్పాటు చేసుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.