సిటీబ్యూరో: సీఎంసీ పరిధిలో కొందరి అవినీతి అధికారులు కొత్త దారి వెతుక్కున్నాయి.. నిబంధనల సాకుతో సామాన్యులను వేధించే అధికారులు..ఇప్పుడు ఏకంగా అక్రమ వసూళ్లకు తెరలేపారు. అత్యంత ఖరీదైన వెస్ట్ జోన్ (పశ్చిమ మండలం) కేంద్రంగా ప్రకటనల బోర్డుల వ్యవహారం అవినీతి అధికారులకు కాసుల కుంభకోణంగా మారింది. ‘రెండు లక్షలు ఇస్తావా? లేదంటే బోర్డులు పీకేమయంటావా? అంటూ బహిరంగంగానే ఏజెన్సీలను బెదిరిస్తున్న తీరు శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో చర్చనీయాంశంగా మారింది. నూతనంగా వచ్చిన డీసీ, ఏఎంసీ ప్రకటనల బోర్డుల నుంచి దందాకు పాల్పడుతున్నారని, అక్రమంగా కొనసాగుతున్న ఏజెన్సీల నుంచి అందినంత దండుకుని వదిలేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడిగింది ఇవ్వకుంటే ప్రకటనల బోర్డులు తీసేస్తున్నారని, వాస్తవానికి అనధికారిక బోర్డుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తుండడం పట్ల సదరు అధికారులపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రకటనల బోర్డులు, హోర్డింగ్లపై ఎవరైనా ఫిర్యా దు చేస్తే చాలు.. సదరు అధికారులు రంగంలోకి దిగుతున్నారు. అయితే అది నిబంధనలు అమలు చేయడానికి కాదు, తమ జేబు లు నింపుకోవడానికి.. ఫిర్యాదు అందిన వెంటనే ఏజెన్సీ నిర్వాహకులకు ఫోన్లు వెళ్తున్నాయి. ‘మీపై ఫిర్యాదు వచ్చింది, పైన ఒత్తిడి ఉంది.. సెటిల్ చేసుకుంటే ఫైల్ పకన పెడతాం.. లేదంటే జేసీబీలు వస్తాయి’ అంటూ బేరసారాలు మొదలుపెడుతున్నట్లు ప్రచారం సాగుతున్నది అడిగినంత ఇస్తే నెల ల తరబడి అక్రమ బోర్డులు ఉన్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పైసలు ఇవ్వని పక్షంలో, అర్ధరాత్రి వేళ సిబ్బందిని పంపి అడ్డంగా బోర్డులను తొలగిస్తూ భయోత్పాతం సృష్టిస్తున్నారన్న చర్చ జరుగుతున్నది. తొలగించాలన్న ఆదేశాలు భేఖాతరు పాదచారుల సౌకర్యార్థం నిర్మించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిల (ఎఫ్వోబీ) నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనపై అప్పటి జీహెచ్ఎంసీ కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ) పద్ధతిలో రాయదుర్గంలోని దివ్యశ్రీ వద్ద, అలాగే మియాపూర్ ఆల్విన్ ఎక్స్ రోడ్స్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, నిర్వహణకు సదరు ఏజెన్సీ సంస్థతో జీహెచ్ఎంసీ ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ప్రకారం నిర్దేశిత కాలపరిమితి వరకు మాత్రమే అకడ ప్రకటనలు ప్రదర్శించుకునేందుకు సదరు సంస్థకు అనుమతి ఉంది. అయితే రాయదుర్గం 2023 మార్చి 25, అల్విన్ క్రాస్ రోడ్ వద్ద 2024 డిసెంబర్ 25న గడువు ముగిసింది. ఇది నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాకుండా, ప్రభుత్వ ఆస్తిని అక్రమంగా ఆక్రమించుకోవడమేనని జీహెచ్ఎంసీ తీవ్రంగా పరిగణించింది. ఆయా బ్రిడ్జిల నుంచి ప్రకటనల బోర్డులను తొలగించి, వాటిని జీహెచ్ ఎంసీకి అప్పగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమోదంతో అడ్వరె్టైజ్ మెంట్ విభాగం సదరు సంస్థకు తుది నోటీసు జారీ చేసింది. ఏడు రోజుల్లోగా అన్ని రకాల హోర్డింగ్లు, బోర్డులను తొలగించి, బ్రిడ్జిలను సురక్షితమైన స్థితిలో జీహెచ్ఎంసీకి అప్పగించాలని ఆదేశించింది.
ఒకవేళ నిర్దేశిత సమయంలోగా స్పందించకపోతే, అధికారులే స్వయంగా ఆ బోర్డులను తొలగించి, దానికి అయ్యే ఖర్చును సదరు సంస్థ నుంచే వసూలు చేస్తామని, అలాగే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిబంధనల ప్రకారం వంతెనలను జీహెచ్ఎంసీకి అప్పగించాల్సింది పోయి, నేటికీ అక్రమంగా ప్రకటనలను ప్రదర్శిస్తూ లక్షల రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నది. దీనివల్ల జీహెచ్ఎంసీకి రావాల్సిన అడ్వర్టయిజ్మెంట్ ట్యాక్స్, రెవెన్యూ షేర్ దకడం లేదని ఇటీవల ఫిర్యాదులో పేరొన్నారు. ఏజెన్సీ నుంచి రావాల్సిన పెనాల్టీలు, పన్నులను వసూలు చేసి, వెంటనే సదరు ఎఫ్ఓబీలను జీహెచ్ఎంసీ స్వాధీనం చేసుకోవాల్సిన సదరు ఏజెన్సీల నుంచి డీసీ, ఏఎంఎసీలు ఒక్కో ప్రకటనల బోర్డుల నుంచి లక్షలాది రూపాయలు గుంజుతూ అక్రమార్జన తెరలేపినట్లు ప్రచారం సాగుతున్నది. ఈ విషయంలో సీఎంసీ కమిషనర్ సృజన జోక్యం చేసుకుని అవినీతి అధికారులతో పాటు అక్రమ ప్రకటనలపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి..
హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన వెస్ట్ జోన్ ప్రాంతంలో అధికార పార్టీ నేతల బినామీలు ప్రకటనల మాఫియాకు తెరలేపారు. అధికార పార్టీకి చెందిన ఒక యువ ఎమ్మెల్సీ అండదండలతో తన అనుచరగణం హల్చల్ చేస్తున్నది. అధికారులపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా ప్రకటనల బోర్డుల ఏర్పాటుకు బినామీ ఎజెన్సీలతో కలిసి సదరు ఎమ్మెల్సీ తన పరపతిని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. సొంతంగా అడ్వర్టెజ్మెంట్ ఏజెన్సీలు నడుపుతున్న అనుచరులను ముందు పెట్టి ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన లక్షలాది రూపాయలను దారిమళ్లిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
అయ్యప్పసోసైటీ, గచ్చిబౌలిలో గతంలో విచ్చలవిడిగా అనుమతి లేని ప్రకటనల బోర్డులతో ప్రభుత్వ ఖజానాను గండికొట్టడం, అనధికారిక బోర్డులపై ఓ మహిళ లోకాయుక్తలో ఫిర్యాదు (నంబరు 1188/2025/బి1) చేశారు. తీవ్రంగా స్పందించిన లోకాయుక్త ఆయా ప్రకటనలను తొలగించాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. దీనిని సీరియస్గా తీసుకున్న సదరు ఎమ్మెల్సీ అనుచరులు లోకాయుక్తలో వేసిన కేసును విత్డ్రా చేసుకోవాలని మహిళపై బెదిరింపులకు పాల్పడ్డారు.. దీంతో బాధిత మహిళా గతనెల 30వ తేదీన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేశారు. దీనికి ప్రతిగా ఎమ్మెల్సీ అనుచరులు సైతం మహిళపై తిరిగి ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదులతో పోలీస్ మెట్లు ఎక్కిన తీరుపై మిగతా ఎజెన్సీలలో తీవ్ర చర్చ జరుగుతున్నది.