సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ) : నిర్వహణకు నోచుకోక స్ట్రీట్లైట్లు వెలగకపోవడంతో నగర వీధుల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. దీంతో నగరవాసులు రాత్రివేళల్లో పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గడిచిన కొన్ని నెలలుగా వీధి దీపాల నిర్వహణ విషయంలో అధికారుల డొల్లతనం వెలుగు చూసింది. నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈఈఎస్ఎల్, జీహెచ్ఎంసీ అధికారుల మధ్య సమన్వయం లేమి ఫలితంగా చాలా ప్రాంతాల్లో చీకట్లు అలుముకున్నాయి.
ఇదే విషయాన్ని కార్పొరేటర్లు గత కౌన్సిల్ సమావేశంలో నిలదీశారు. అంతేకాకుండా ఇటీవల వీధి లైట్లు వెలగడం లేదంటూ జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కమిషనర్ ఆర్ వీ కర్ణన్ వీధి లైట్ల నిర్వహణ విషయంలో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. గ్రేటర్లో స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలను కొత్త ఏజెన్సీలకు అప్పగించేందుకు చర్యలు వేగవంతం చేశారు.
ఇందులో భాగంగా టెండర్లు పిలిచారు. మరో పక్క..నగరంలో ఎన్ని స్తంభాలు ఉన్నాయని లెక్క తేల్చేందుకు సర్వే నిర్వహిస్తున్నది. ఈ సర్వే ఇప్పటి వరకు 83శాతం పూర్తి కాగా గతంలో 5,50,088 వీధి దీపాలు ఉన్నాయన్న అంచనాతో మొదలు పెట్టిన సర్వేలో ఇప్పటి వరకు 4,57,756 స్తంభాలు ఉన్నట్లు తేల్చారు.
ఇండివిజ్యువల్ ల్యుమినర్ కంట్రోల్ (ఐఎల్సీ) లేదా ఇంటిగ్రేటెడ్ మినార్ మానిటరింగ్ (ఐఎంఎం) సిస్టం అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఐఎల్సీ ద్వారా ఒక్కో వీధిదీపాన్ని వెలుగుతుందో లేదో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ టెక్నాలజీ ద్వారా ఒకే చోట నుంచి ఎక్కడ స్ట్రీట్ లైట్ వెలగకపోయినా తెలుసుకోవచ్చు.
అదే ఐఎంఎంతో అయితే ఒక ఏరియా లేదా కొన్ని లైట్లు కలిపి మెయింటెయిన్ చేయొచ్చు. ఈ రెండింట్లో ఏదో ఒక సిస్టం అమల్లోకి తీసుకురానున్నారు. కాగా కొత్తగా వచ్చే ఏజెన్సీలకు ఏడేండ్లకు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. గతంలో పదేండ్ల పాటు ఈఈఎస్ఎల్ నిర్వహణ బాధ్యతలు చూడగా ప్రతి నెలా రూ. 8 కోట్ల వరకు బల్దియా చెల్లించింది.
నూతన విధానానికి ఈ ఖర్చు అధికం అయ్యే అవకాశాలున్నాయని, ఏడేండ్లకు సుమారు రూ.1,300 నుంచి రూ. 1,500 కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం కొత్త ఏజెన్సీ ఖరారు చేసే వరకు జోనల్ స్థాయిలో ఇప్పటికే 1,200 ఎల్ఈడీ లైట్లు కొని అవసరమైన చోట ఏర్పాటు చేస్తున్నప్పటికీ చాలా చోట్ల వీధి లైట్లు వెలగకపోవడం గమనార్హం.