సిటీబ్యూరో, నవంబర్ 3(నమస్తే తెలంగాణ) : బోరబండ మైనారిటీ నాయకుడు సర్దార్ మృతికి కారణం కార్పొరేటర్ బాబాఫసియుద్దీన్ అని అన్ని ఆధారాలున్నప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోగా ..కాంగ్రెస్ ప్రభుత్వం అతడికి గన్‌మెన్‌ను కేటాయించడంతో స్థానికులు మండిపడుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో స్టార్ క్యాంపెయినర్‌గా బాబాను పక్కన పెట్టుకుని రేవంత్‌రెడ్డి ప్రచారం చేయడంతో ఇక బాబా ఆగడాలు ఆగవు అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జూబ్లీహిల్స్‌లోని కీలకమైన బోరబండలో బాబా ఫసియుద్దీన్ గన్మెన్లతో కలిసి ప్రచారం చేస్తుండడంతో భయమవుతుందని ప్రజలు వాపోతున్నారు.
సర్దార్ మే 29న ఆత్మహత్య చేసుకోవడానికి కారణం బాబాఫసియుద్దీన్ బెదిరింపులేనంటూ ఆయన కుటుంబం పోలీసులకు అన్ని సాక్ష్యాలు ఇచ్చింది. సర్దార్‌ను బెదిరించిన ఆడియోలు మీడియాకు విడుదల చేసింది. అయినా పోలీసులు అతడిని అరెస్ట్ చేయలేదు. అధికార పార్టీ పెద్దలే అతడికి అండగా ఉండడంతో ఆగడాలకు పూర్తి మద్దతు లభించినట్లయింది. బాబాపై చర్యలు తీసుకోవాలంటూ సర్దార్ కుటుంబం కోరినా పోలీసులు పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ బాబా తన వికృత స్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు ఓటేయకపోతే తాను ఈ ప్రాంతం వైపు చూడనన్న అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చిన రేవంత్‌రెడ్డి, బాబాలాంటి అరాచకవ్యక్తికి గన్‌మెన్‌ను ఇచ్చి తమపైకి తోలడమేంటని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.
బాబాఫసియుద్దీన్ను అరెస్ట్ చేయకుండా గన్‌మెన్‌ను కేటాయించడంపై సర్దార్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇంతవరకు న్యాయం జరగలేదని,కాంగ్రెస్ ప్రభుత్వమే అతడిని అండగా ఉండి కాపాడుతున్నదని వారు ఆరోపించారు. బాబా అరాచకాలపై సర్దార్ తల్లి ఫాతిమా, భార్య షమీనా మాట్లాడుతూనే తమకు న్యాయం చేయాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. సర్దార్ అభిమానులు కొందరు సర్దార్ ఫొటో ధరించిన టీ షర్ట్లతో ఇంటింటికి తిరుగుతూ సమస్యలపై ఆరా తీశారు. బాబాను నిలువరించాలంటే కాంగ్రెస్‌ను ఓడించాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. నిందితుడిగా ఉన్న వ్యక్తికి గన్‌మెన్‌ను ఎలా కేటాయిస్తారంటూ సర్దార్ తల్లి, భార్య ప్రశ్నిస్తున్నారు.