బోరబండ కార్పొరేటర్ ఫసియుద్దీన్ అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. మంగళవారం పోలింగ్ సందర్భంగా ఫసియుద్దీన్ రౌడీయిజం ప్రదర్శించారు. బోరబండ ప్రాంతంలో కాంగ్రెస్ నేతలు పోలింగ్ బూత్‌ల వద్దనే ఓటర్లకు డబ్బులు పంచుతుండటాన్ని గమనించిన బీఆర్ఎస్ కార్యకర్త విజయ్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.
సిటీ బ్యూరో/అల్లాపూర్, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): బోరబండ కార్పొరేటర్ ఫసియుద్దీన్ అరాచకాలకు అడ్డూ అదపు లేకుండా పోతున్నది. మంగళవారం పోలింగ్ సందర్భంగా ఫసియుద్దీన్ రౌడీయిజం ప్రదర్శించారు. బోరబండ ప్రాంతంలో కాంగ్రెస్ నేతలు పోలింగ్ బూత్‌ల వద్దనే ఓటర్లకు డబ్బులు పంచుతుండటాన్ని గమనించిన బీఆర్ఎస్ కార్యకర్త విజయ్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ ఫసియుద్దీన్ విజయ్‌పై దుర్భాషలాడారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరూ ఇక్కడ ఉండొద్దని బెదిరింపులకు దిగాడు. ప్రతిఘటించిన విజయ్‌పై ఫసియుద్దీన్ దాడికి తెగబడ్డారు. డబ్బులు పంచుతుంటే అడ్డుకోవడానికి నువ్వు ఎవరు? అంటూ దాడి చేశాడు. నిన్ను బోరబండలో తిరగనీయమని హెచ్చరించాడు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆటలు ఇక్కడ సాగవంటూ రౌడీయిజం ప్రదర్శించాడు. అధికారంలో ఉన్నది తామేనని.. ఎక్కడైనా ఏమైనా చేస్తాం.. ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటూ ఊగిపోయాడు. బీఆర్ఎస్ కార్యకర్తలను ఆదుకునేందుకు ఎవరొస్తారో చూస్తామంటూ గూండాగిరి ప్రదర్శించాడు.

కాంగ్రెస్ అరాచకాలకు పోలీసుల రక్షణ..!
పోలింగ్ బూత్ వద్ద ఫసియుద్దీన్ బహిరంగంగా బీఆర్ఎస్ కార్యకర్తపై దాడి చేస్తున్నా పోలీసులు స్పందించలేదు. కనీసం ఆపేందుకు ప్రయత్నించలేదు. పోలింగ్ పూర్తయ్యేదాకా పోలీసుందరూ.. కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహించారనే విమర్శలున్నాయి. బోరబండలో ఫసియుద్దీన్ రౌడీయిజం చేస్తున్నా అక్కడే ఉండి వేడుక చూశారు. అలాగే బోరబండలోని సైట్-3 పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలపై నవీన్ యాదవ్ అనుచరులు దౌర్జన్యానికి దిగారు. బీఆర్ఎస్ టేబుల్ వద్దకు వచ్చి ఓటర్ లిస్ట్ లాక్కొని వెళ్లారు. పోలీసులు అక్కడే ఉన్నా కనీసం పట్టించుకోలేదు. ఓటర్ లిస్టు ఇవ్వాలన్న బీఆర్ఎస్ మహిళా కార్యకర్తపై నవీన్ అనుచరులు బూతులతో విరుచుకుపడ్డారు. అయినా పోలీసులు కనీసం స్పందించలేదు. నియోజకవర్గ వ్యాప్తంగా నవీన్ యాదవ్ అనుచరులు గూండాయిజం చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.