Hyderabad | సిటీబ్యూరో, మార్చి 29(నమస్తే తెలంగాణ): నగరంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రెండు ప్రాజెక్టులను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులనీ చెబుతున్నారే తప్పా… పరిహారం, ప్రాజెక్టు వివరాల్లో గోప్యం, స్థానికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో కోర్టులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆ పార్టీ చేపట్టిన రెండు ప్రాజెక్టులను వివాదాలు ముసురుకుంటున్నాయి.
నార్త్ సిటీకి మెరుగైన రవాణా సదుపాయాలను కల్పించాలనే లక్ష్యంతో జేబీఎస్ నుంచి శామీర్పేట, ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫాం మార్గాల్లో రానున్న 18 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్లు, ఓల్డ్ సిటీకి మెట్రో విస్తరించేలా ఎంబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట 7.5 కిలోమీటర్ల మెట్రో కారిడార్ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున్న నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అనుకున్న సమయం కంటే గడువు దాటుతున్నా..భూసేకరణ వ్యవహారాలు కొలిక్కి రావడం లేదు. దీంతో ఆ ప్రాజెక్టుల భవిత ప్రశ్నార్థకంగా మారుతోంది.
జేబీఎస్, ప్యారడైజ్ కేంద్రంగా హెచ్ఎండీఏ ప్రతిపాదించిన రెండు ఎలివేటెడ్ కారిడార్లకు 7 నెలల క్రితం భూసేకరణ నోటీసులు జారీ చేసింది. ప్రాజెక్టు కోసం 200 ఫీట్ల వెడల్పుతో ఇరువైపులా ఆస్తుల సేకరణ బాధ్యతలను మేడ్చల్, హైదరాబాద్ జిల్లా అధికారులకు ప్రభుత్వం అప్పగించింది. బడ్జెట్ సర్దుబాటు కాకపోయినా… డిజైన్లను సిద్ధం పెట్టుకున్న హెచ్ఎండీఏ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ పూర్తి కాకపోవడంతో నిర్మాణ పనులు చేపట్టలేకపోతున్నది.
ఈ అంశంలో రెండు జిల్లాల రెవెన్యూ, భూసేకరణ అధికారులు గ్రామ సభలకు రావాలని స్థానికులను కోరుతున్నా… బాధితులు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. 200 ఫీట్ల వెడల్పుతో రోడ్డు విస్తరణ పనులతో తమ ఆస్తుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని, కనీసం 150 ఫీట్లకు రోడ్డు వెడల్పు తగ్గించాలని డిమాండ్ చేస్తుండగా… పరిహారం విషయంలోనూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో భూసేకరణ కోసం నిర్వహించిన గ్రామసభలను వ్యతిరేకిస్తుండగా.. ఇప్పటికే ప్రాజెక్టు కోసం తమ ఆస్తులను కూల్చొద్దని వేడుకుంటూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు.
ఓల్డ్ సిటీలో మెట్రో విస్తరణకు అడుగులు ముందుకు పడటం లేదు. గతంలో ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు నిర్మించాలని తొలుత ప్రతిపాదనలు ఉండేవి. ఈ ప్రాజెక్టుకే భూసేకరణ నుంచి పరిహారం వరకు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే మరో రెండు కిలోమీటర్లు మేర విస్తరించి 6 మెట్రో స్టేషన్లతో నిర్మాణం చేపడతామని హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి ప్రకటించారు. జనవరి మొదటి వారంలోనే కూల్చివేతలు మొదలుపెడతామని చెప్పినా… ఇప్పటికీ భూసేకరణ 30 శాతం కూడా చేరలేదు.
ఈ క్రమంలో ప్రభుత్వం కూడా భూసేకరణలో స్థానికంగా తలెత్తున్న ఇబ్బందులపై దృష్టి పెట్టకపోవడంతో ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. దీనికి తోడు పరిహారం విషయంలో ఇప్పటికే కొంతమంది హైకోర్టును ఆశ్రయించగా,… ఈ ప్రాజెక్టు ద్వారా మతపరమైన కట్టడాలు, చారిత్రక భవనాలను కాపాడాలంటూ చరిత్రకారులు న్యాయపోరాటం చేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చేందుకు తొలుత ఆసక్తి చూపినా… స్థానికంగా ఎదురవుతున్న ఇబ్బందులతో జనాల అభిప్రాయం కూడా మారిపోతున్నది. ఇలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఒక్క అడుగు ముందుకు మూడు అడుగుల వెనక్కి అన్న చందంగా ప్రాజెక్టుల పురోగతి ఉంది.