సిటీబ్యూరో, మే 20, (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో కాంట్రాక్టర్ల పోరుబాట కొనసాగుతున్నది. రూ.1350 కోట్ల మేర పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు జీహెచ్ఎంసీకి సంబంధించిన మెయింటెనెన్స్ పనులు చేపట్టబోమంటూ.. ఈ నెల 18 నుంచి కాంట్రాక్టర్లంతా సమ్మెలోకి వెళ్లి నిరసన తెలుపుతున్నారు. తొలిరోజు బల్దియా ప్రధాన కార్యాలయంలోని కాంట్రాక్టర్ల అసోసియేషన్ కార్యాలయం ముందు నిరసన చేపట్టగా…సోమవారం ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో కాంట్రాక్టర్లు భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘వీ వాంట్ పేమెంట్స్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
చేసిన పనులకు బిల్లులు రాక ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుని బతకలేని పరిస్థితిలో ఉన్నామంటూ.. కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల చదువులకు డబ్బులు లేక, వర్కర్లకు ఈపీఎఫ్, బ్యాంకులకు ఈఎంఐలు కట్టలేకపోతున్నామని, ఆర్థిక బాధలతో సడెన్ స్ట్రోక్‌లకు గురై ప్రాణాలు పోతున్న పరిస్థితులు వచ్చాయని అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు రోజులుగా కాంట్రాక్టర్లు రోడ్లు, డ్రైనేజీలు, నాలాలు, కరెంట్ పోల్స్, పార్కులు, ప్లే గ్రౌండ్, శ్మశానవాటికల అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు, డ్రైనేజీ ఇలా మెయింటెనెన్స్ పనులు నిలిపివేసి బంద్‌లోకి వెళ్లారు. అసలే వర్షాకాలం..అపై కాంట్రాక్టర్లు బంద్‌లోకి వెళ్లడంలో అధికారులు ఆలస్యంగానైనా అలర్ట్ అయ్యారు.
ఈ మేరకు కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులతో ఫైనాన్స్ విభాగం అధికారులు చర్చలు జరిపారు. మే నెలకు సంబంధించిన రూ. 57 కోట్ల నిధులను మంజూరు చేశారు. దీనిపై కాంట్రాక్టర్లు మాత్రం పెదవి విరుస్తున్నారు. పెండింగ్ బిల్లులు భారీగా ఉంటే నామమాత్రంగా డబ్బులు కేటాయించి పనుల్లోకి రావాలని అనడం ఎంత వరకు సమంజసమని, బకాయిలు మొత్తం విడుదల చేసే వరకు పనులు చేపట్టబోమని, నిరసనను కొనసాగిస్తామని ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.
మాన్సూన్ ముందస్తు చర్యల్లో భాగంగా అత్యవసర పనుల్లో నిర్లక్ష్యం వహించవద్దని, పనుల్లో జాప్యం చేస్తే సంబంధిత ఐఆర్టీ కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సోమవారం బల్దియా మెమో జారీ చేసింది. టెండర్ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని, ముందస్తు ఒప్పందం మేరకు బిల్లుల చెల్లింపులు జీహెచ్ఎంసీ సకాలంలో జరుపుతుందని, అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించింది. కాంట్రాక్టర్లు మాత్రం బకాయిలు చెల్లించకుంటే అవసరమైతే ఐఆర్టీ పనులను కూడా నిలిపివేస్తామని ప్రకటించారు. మొత్తంగా వర్షాకాలం ప్రారంభానికి ముందే బల్దియా పాలన అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలకు వరద ముంపు నివారణ చర్యలను ఎలా అధిగమిస్తారోరన్న ఆందోళన ప్రజల్లో నెలకొన్నది.