మణికొండ, జనవరి 10: నార్సింగిలో అనుమతులకు విరుద్ధంగా..చెట్లను తొలగించి మరీ హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు కాంట్రాక్టర్లు. మున్సిపాలిటీ నుంచి అనుమతులు లేకున్నా తమకు ఆర్అండ్బీ అనుమతిచ్చిందని దబాయిస్తున్నారు. ఒకటి కాదు 2 కాదు దాదాపు 3కిలోమీటర్ల పొడవైన రహదారిలో 3వేలకు పైగా హోర్డింగులు ఏర్పాటు చేశారు. తద్వారా రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగ సంస్థలకు విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నారు. ఈ తతంగానికి మున్సిపాలిటీ పాలకవర్గంలోని కొంతమంది పెద్దలు సంపూర్ణ సహకారం అందించి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నట్టు.. స్థానిక నివాసులే బాహాటంగా ఆరోపణలు చేస్తున్నారు.
నార్సింగి మున్సిపాలిటీ పరిధి మొదలు నుంచి శంకర్పల్లి ఎక్స్‌రోడ్డు, అక్కడ నుంచి మున్సిపాలిటీ చివర ఖానాపూర్ గ్రామ శివారు వరకు వేలాదిగా హోర్డింగు(లాలీపాప్)లు రోడ్డు మధ్యలో పోటాపోటీగా ఏర్పాటైయ్యాయి. నిబంధనల ప్రకారం 300మీటర్లకు ఒకటి చొప్పు పెట్టాల్సిన పెద్ద హోర్డింగులు పది అడుగుల దూరంలో ఏర్పాటు చేశారు. హోర్డింగుల ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయం టూ ప్రజలు అధికారులకు చెబితే.. ఆర్అండ్బీ శాఖదే బాధ్యత అంటూ మున్సిపాలిటీ శాఖ తప్పించుకోవడం గమనార్హం.
మున్సిపాలిటీలో గత కొన్నాళ్లుగా ఓ కాంట్రాక్టర్ అటు అధికారులు..ఇటు పాలక వర్గానికి రింగ్‌మాస్టర్‌గా వ్యవహరిస్తూ అన్నీ తానై నడుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఓ వైపు సివిల్ కాంట్రాక్టర్ పనులు చేస్తూ అక్కడా నాణ్యతాప్రమాణాలను పాటించకుండా.. ఇప్పుడు తాజాగా హోర్డింగుల జాతరలో అనుమతులు లేకుండా అధికారులను బుట్టలో వేసుకుని కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నాడని స్థానికులు పేర్కొంటున్నారు. అంతే కాకుండా రోడ్డు భవనాలశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని రహదారుల మధ్యలో ఏర్పాటు చేస్తున్న హోర్డింగుల వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. రోడ్డు మధ్యలో హోర్డింగులు ఏర్పాటు చేస్త్తే ప్రమాదాలు నెలకొంటాయని అప్పటి మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి తప్పవని బాధ్యులకు నోటీసులు జారీచేశారు. కానీ కొత్త సర్కారు ఏర్పాటైన నెలరోజుల వ్యవధిలోనే వేలసంఖ్యలో హోర్డింగుల జాతర ఏర్పాటవడంపై స్థానిక ప్రజలు మండిపడుతున్నారు.