బడంగ్పేట్, డిసెంబర్1: గ్రేటర్లో ఓఆర్ఆర్ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం అవ్వనున్న నేపథ్యంలో కాంట్రాక్టర్లు కార్పొరేషన్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కార్యాలయాల్లోనే తిష్ట వేస్తున్నారు. ఎంబీ రికార్డులు పట్టుకొని అధికారుల చాంబర్ దగ్గర ఎదురుచూస్తున్నారు. అయితే వరుస క్రమంలో బిల్లులు ఇవ్వకుండా తమకు అనుకూలంగా ఉన్న కొంతమంది కాంట్రాక్టర్లకే అధికారులు బిల్లులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బడంగ్పేట్, మీర్పేట్, కార్పొరేషన్లతో పాటు తుక్కుగూడ, జల్పల్లి మున్సిపాలిటీలలో ఈ తంతు కొనసాగుతోంది. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి కాంట్రాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది కాట్రాక్టర్లు అధికార పార్టీ నాయకులతో ఒత్తిడి చేయించి బిల్లులు తీసుకుంటుండగా మరికొంతమంది అధికార పార్టీ నేతలతో కలిసి అధికారుల దగ్గర బిల్లుల క్లియరెన్స్ కోసం రాత్రివరకు తిష్ట వేస్తున్నట్లు సమాచారం.
అనుకూలంగా ఉన్నవారికే బిల్లులు..!
రెండు సంవత్సరాల క్రితం పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా తమకు అనుకూలంగా ఉండేవారికే అధికారులు మొదటి వరసలో బిల్లులు ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పర్సంటేజీని బట్టి బిల్లులు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడు ఏ పనిచేశారో తేదీలను చూసుకోకుండా అధికారులు బిల్లులు ఇవ్వడం పట్ల కొంతమంది కాంట్రాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చినవారికి బిల్లులు ఇస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గ్రేటర్లో విలీనం చేయకముందే బిల్లులు తీసుకోవాలని హడావుడి చేస్తున్నారు. చేయని పనులకు సైతం బిల్లులు తీసుకుంటున్నారంటూ కొంతమంది కాంట్రాక్టర్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
పనులు పూర్తికానప్పటికీ..
కొంత మంది కాంట్రాక్టర్లు దొడ్డిదారిన బిల్లులు తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. కొంతమేరకు పనులు చేసి మధ్యస్తంగానే పనులు నిలిపివేసిన వాటికి కూడా చెక్కులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. కార్పొరేషన్లలో కాంట్రాక్టర్లక్లు ఇవ్వవలసిన డబ్బులు లేకపోవడంతో ట్రెజరరీ ద్వారా తీసుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది. ట్రెజరరీలో అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో, మున్సిపాలిటీలలో డబ్బులు ఉన్నాయి. ట్రెజరరీ ద్వారా చెక్కులు తీసుకుంటే సీరియల్ వచ్చిన్నప్పుడు మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి అభివృద్ధి పనులు చేయనివారు కూడా ట్రెజరీ ద్వారా చెక్కులు తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అధికారులు జరిగిన పనులకే బిల్లులు ఇస్తారా? లేదా చేయని పనులకు కూడా పర్సంటేజ్ తీసుకుని ముందే చెక్కులు ఇస్తారో వేచి చూడాలి.