సిటీబ్యూరో, జనవరి 18(నమస్తే తెలంగాణ): టీజీఎస్పీడీసీఎల్ పరిధిలో ఎండాకాలం విద్యుత్ సరఫరా కోసం యాజమాన్యం సమాయత్తమవుతోంది. గతేడాది వచ్చిన డిమాండ్ మేరకు అధిక లోడ్ ఉన్న ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి అవసరమైన చోట ఫీడర్ల విభజన, కొత్త ఫీడర్ల ఏర్పాటు, పీటీఆర్, డీటీఆర్‌ల ఏర్పాటు, వివిధ సెక్షన్లలో మరమ్మతు పనులు, సబ్స్టేషన్ల మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఇందుకోసం డిస్కం అవసరమైనన్ని నిధులు విడుదల చేసింది. అయితే ఈ పనులు టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్ పద్ధతిలో ఇవ్వడంతో ఇటు విద్యుత్ ఇంజినీర్లకు, అటు కాంట్రాక్టర్లకు కాసుల పంట పండుతోంది. తమకు నచ్చిన వారికే పనులు కేటాయిస్తూ పెద్ద ఎత్తున అక్రమాలకు తెరతీశారంటూ డిస్కంలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తమకు రావాల్సిన పర్సంటేజీలు ముట్టడంతో కొందరు ఇంజినీర్లు పనులపై ఆజమాయిషీ చేయకుండా పూర్తిగా వదిలేయడంతో పనులన్నీ తూతూమంత్రంగా జరిగాయి.
గత సంవత్సరం కేబుల్ కారణంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో అరవైకి పైగా పెద్ద పనులు పెండింగ్‌లో పడగా..ఈసారి కూడా డీటీఆర్, పీటీఆర్, కేబుళ్ల దందాతో అదే పరిస్థితి ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఒకవైపు సామగ్రిలో కమీషన్లు, మరోవైపు పనుల్లో పర్సంటేజీలతో కొందరు కాంట్రాక్టర్లు చేస్తున్న దందా ప్రధాన సర్కిళ్లలోని కొంతమంది ఇంజినీర్లకు జేబులు నింపుతోందనే చర్చ జరుగుతోంది. ఇంకొన్ని చోట్ల చేసిన పనులే మళ్లీ మళ్లీ చేస్తున్నట్లు చెప్పుకొని స్థానిక అధికారులతో కలిసిపోయి బిల్లులు తీసుకుంటున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత సంవత్సరం సమ్మర్లో ఎక్కడైతే సమస్యలు తలెత్తాయో.. ఏ ప్రాంతాల్లో పనులు జరగకుండా ఆగిపోయాయో వాటిని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ తయారు చేస్తే అందులో కొన్ని పాతవాటికే కొత్త రూపు ఇచ్చి పనులు చేస్తున్నట్లుగా డిస్కంలో అధికారులు అంటున్నారు.
అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కు..!
గ్రేటర్ హైదరాబాద్‌లోని 10 సర్కిళ్లు, 30 డివిజన్లు, 77 సబ్డివిజన్లు, 252 సెక్షన్లలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనులు నడుస్తున్నాయి. వేసవిలో వచ్చే విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవడానికి అవసరమైన పనులను చేస్తున్నారు. ఇందుకోసం లక్షల రూపాయలను యాజమాన్యం కేటాయించింది. అయితే కొన్ని సర్కిళ్లలో లక్షల్లో ఉన్న పనులను డమ్మీ టెండర్ల ద్వారా తమకు నచ్చిన కాంట్రాక్టర్‌తో అధికారులు కుమ్మక్కై పనులు చేయిస్తున్నారంటూ డిస్కంలో గుసగుసలాడుకుంటున్నారు. కొన్నింటిలో లక్ష రూపాయలు దాటే పనులను కూడా చిన్నచిన్న పనులుగా విభజించి ఆ పనులను కూడా తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని తెలిసింది. ఈ నేపథ్యంలో సమ్మర్ ప్లాన్ దాదాపు 60శాతం పనులు డమ్మీ టెండర్ల పద్ధతుల్లోనే సాగుతున్నాయని సమాచారం. ఇప్పటికే టర్న్‌కీ పద్ధతిలో సాగుతున్న పనుల్లో చాలామంది ఆర్డిజన్ కార్మికులు, లైన్మెన్లు, ఏఈలు, కొన్నిచోట్ల డీఈలు బినామీలుగా తమ వారితోనే పనులు చేయించుకుంటున్నారు. డిపార్ట్మెంట్ పనులను సెక్షన్ కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై వాటాల వారీగా పనులు చేయిస్తున్నారని డిస్కం ఉద్యోగులే చెప్పుకుంటున్నారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో పనుల వ్యవహారంలో కొందరు ఆర్టిజన్లు, లైన్మెన్ల ప్రమేయం ఉందని, ప్రైవేటు పనులను టర్న్‌కీ విధానంలో చేయడంతో పాటు డిపార్ట్మెంట్ పనులను కూడా వారే బినామీలతో చేయిస్తున్నారని, వీరికి కొందరు ఇంజినీర్లు మద్దతు పలకడంపై డిపార్ట్మెంట్లో చర్చ జరుగుతోంది.
శివారు ప్రాంతాల్లో ఫిఫ్టీ..ఫిఫ్టీ..!
సమ్మర్ యాక్షన్ ప్లాన్‌లో పనులను కొందరు ఇంజినీర్లు, సెక్షన్ కాంట్రాక్టర్లు కలిసి ఫిఫ్టీ ఫిఫ్టీ పద్ధతిలో పంచుకుంటున్నారని డిస్కంలో చెప్పుకొంటున్నారు. ఈ పనులు శివారు ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయని, కొంతమంది కాంట్రాక్టర్లు ముందుగానే ఏఈ,డీఈలకు డబ్బులు ఇచ్చి పనులు నామినేషన్ పద్ధతిలో దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజేంద్రనగర్, గచ్చిబౌలి, ఇబ్రహీంపట్నం, కీసర, ఇబ్రహీంబాగ్, పటాన్చెరువు,కందుకూరు తదితర ప్రాంతాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ మింట్‌కాంపౌండ్‌లో బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే గత సంవత్సరం కొన్నిచోట్ల అవసరం లేని పనులను ప్లాన్‌లో చేర్చి తమ వారితో చేయించినట్లుగా చూపించి బిల్లులు తీసుకున్నట్లుగా కొందరు ఉద్యోగులపై ఫిర్యాదులొచ్చాయి.
వీటిపై విజిలెన్స్ విచారణ కూడా జరిగినట్లు ఓ సీనియర్ విద్యుత్ అధికారి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన బదిలీల్లో కొందరిని ప్రాధాన్యత లేని స్థానాలకు పంపేలా సీఎండీ ముషారఫ్ సీరియస్ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పనుల విషయంలో సరైన ఆజమాయిషీ లేకపోవడంతో క్షేత్రస్థాయిలో అక్రమాలు ఆగడం లేదు. ముఖ్యంగా బదిలీలు జరిగినప్పటికీ తమవారికి పనులు కేటాయించడం, జరుగుతున్న పనులను చూసీ చూడనట్లుగా వదిలేయాలంటూ కొందరు ఇంజినీర్లు ప్రస్తుతం ఉన్న అధికారులకు సిఫారసు చేస్తున్నట్లుగా సమాచారం. దీంతో పనులు జరిగినా, జరగకపోయినా, నాణ్యత ఉన్నా లేకపోయినా పెద్దగా పట్టింపు ఉండదని, దీంతో పనులు నాసిరకంగా జరుగుతాయని ఓ డివిజనల్ ఇంజనీర్ చెప్పారు. తాము ఒకవేళ పర్యవేక్షించే ప్రయత్నం చేసినా తమపై ఒత్తిళ్లు వస్తున్నాయని, కొందరు డైరెక్టర్లు, రాజకీయ ప్రతినిధులు నేరుగా సెక్షన్ కాంట్రాక్టర్లకు వత్తాసు పలుకుతూ చూసీచూడనట్లు వదిలేయాలని చెబుతున్నారని ఆ అధికారి చెప్పారు.