నోరుందని విమర్శలు చేస్తే గుణపాఠం తప్పదు
త్వరలో 180 మందికి కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
పరోక్షంగా బీజేపీ నేతలకు చురకలంటించిన ఎమ్మెల్యే సాయన్న
సికింద్రాబాద్, మే 1: కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన సర్వీస్ చార్జీలను తెప్పించేలేని కొంతమంది నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. నోరుంది కదా అని పెద్దా చిన్నా తేడా లేకుండా విమర్శలు చేస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని పరోక్షంగా బీజేపీ నేతలకు ఎమ్మెల్యే చురకలంటించారు. ఈ మేరకు కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, దీంట్లో భాగంగానే తాజాగా దళిత బంధు పథకాన్ని దళితులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో సుమారు రూ.20కోట్ల మేర అడబిడ్డల పెండ్లిలకు అందజేశామని, త్వరలోనే ఒకేసారి 180 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో యువతకు మరింత ప్రోత్సాహం అందించే విధంగా ముందకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో సుమారు 1350 డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి పేదలకు ఇస్తున్నామని, గతంలో ఏ పాలకులు చేయని విధంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు ప్రజాసంక్షేమమే లక్ష్యంగా సాగుతున్నారని చెప్పారు.
సిల్వర్ కంపౌండ్, గాంధీనగర్, శ్రీరామ్‌నగర్, ఓల్డ మారేడ్‌పల్లిలోని డబుల్ ఇండ్లు పూర్తికాగా త్వరలోనే నారాయణ జోపుడి సంఘం, జేపీనగర్, చీపురు బస్తీలలో డబుల్ ఇండ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. కంటోన్మెంట్ పరిధిలో ఉచిత తాగునీటి పథకాన్ని అమలు చేసి దాదాపు 35వేల కుటుంబాలకు మంచినీటిని అందిస్తున్నామన్నారు. నగరం నాలుగు దిక్కులా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంలో భాగంగా కంటోన్మెంట్ పరిధిలోని అల్వాల్(బొల్లారం)లో రూ.897కోట్లతో ఆసుపత్రి నిర్మాణం జరగబోతుందన్నారు. కేంద్రం నుంచి బోర్డుకు రావాల్సిన సుమారు రూ.700కోట్ల సర్వీస్ చార్జీల్లో కేవలం రూ.100కోట్లు విడుదల చేయిస్తే బోర్డు పరిధిలోని ప్రతి బస్తీలో మెరుగైన వసతులు కల్పించవచ్చని ఎమ్మెల్యే సాయన్న స్పష్టం చేశారు. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని, అభివృద్ధి మరింత వేగవంతంగా జరగాలంటే సర్వీస్ చార్జీలను తెప్పించి మాట్లాడాలని హితవు పలికారు. సమావేశంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, లోక్‌నాథ్, నళినికిరణ్, ప్రభాకర్‌తో పాటు నేతలు నివేదిత, ముప్పిడి మధుకర్, పిట్ల నగేష్ తదితరులు పాల్గొన్నారు.